స్వదేశానికి బంగ్లాదేశ్ యువతి..

స్వదేశానికి బంగ్లాదేశ్ యువతి..
  • వ్యభిచార కూపం నుంచి కాపాడిన కోదాడ పోలీసులు
  • ఆ దేశ పోలీసులకు అప్పగించిన కోదాడ పోలీసులు

కోదాడ, వెలుగు : వ్యభిచార గృహంలో పట్టుబడిన విదేశీ యువతిని సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు ఆమె స్వదేశానికి చేర్చారు. కోదాడ పట్టణంలోని అంబేద్కర్  కాలనీలో గత మార్చి నెలలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కోదాడ పట్టణ పోలీసులు ఆ వ్యభిచార గృహంలో సోదాలు చేశారు.

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక విటుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వ్యభిచార గృహం నుంచి తాము రక్షించిన వారిలో ఒక యువతి వివరాలను పోలీసులు తెలుసుకోగా తనది బంగ్లాదేశ్  అని చెప్పింది.

దీంతో ఆ యువతిని కోర్టు ఆదేశాల ప్రకారం  హైదరాబాద్ లోని ప్రజ్వల హోంకు తరలించారు. తన దేశానికి వెళతానని ఆ యువతి చెప్పడంతో పోలీసులు చొరవ తీసుకొని ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. ప్రజ్వల హోం అధికారులు, కోదాడ పోలీసుల ఉమ్మడి కార్యాచరణతో బంగ్లాదేశ్  అధికారులను సంప్రదించి ఆమె వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. 

గురువారం ఆమెను బంగ్లాదేశ్  తీసుకువెళ్లిన కోదాడ ఇన్​స్పెక్టర్​ రాము, ప్రజ్వల హోం సీనియర్ ప్రాజెక్ట్  మేనేజర్ ఎండీ  సిరాజ్.. ఇండో–బంగ్లా సరిహద్దు వద్ద యువతిని ఆ దేశ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా కోదాడ పోలీసులను జిల్లా ఇన్ చార్జి ఎస్పీ నాగేశ్వర రావు, కోదాడ డీఎస్పీ ప్రకాష్  అభినందించారు.