కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత .. కాంటాలు వేసి సెంటర్లలోనే రైతులు పడిగాపులు

కొనుగోలు కేంద్రాల్లో  లారీల కొరత .. కాంటాలు వేసి సెంటర్లలోనే రైతులు పడిగాపులు
  • అకాల వర్షాలతో రోజుల తరబడి ఉండలేక 
  • ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తున్న రైతులు 
  • తేమ సాకుతో మిల్లుల వద్ద ఆన్​లోడింగ్ చేసుకోని మిల్లర్లు 

సూర్యాపేట, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల లక్ష్యం నీరుగారుతోంది. లారీల కొరతతో లోడింగ్, అన్​లోడింగ్ ఆలస్యమవుతున్నాయి. దీంతో రోజుల తరబడి కేంద్రాల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న లారీ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పొలం కోసిన రైతు తేమ శాతం తగ్గేందుకు కొన్ని రోజులు, ఆ తర్వాత సీరియల్ ప్రకారం కాంటాలు వేసేందుకు మరికొన్ని రోజులు, కాంటాలు అయిన ధాన్యం తరలించేందుకు మరికొన్ని రోజులు.. ఇలా ఒక్కో సెంటర్ కు కనీసం రెండు వారాలకు పైగా సమయం పడుతోంది. కాంటాలు వేసిన బస్తాలు కొన్ని కేంద్రాల్లో పది రోజులకు పైగా నిల్వ ఉంటున్నాయి. అదే సమయంలో వాతావరణ పరిస్థితులు రైతులను టెన్షన్ పెడుతున్నాయి.  

లారీలు తక్కువ.. కేంద్రాలు ఎక్కువ.. 

సూర్యాపేట జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాలకు అవసరమైన లారీల టెండర్ల కోసం ఆయా మండలాలను 8 సెక్టార్లుగా విభజించారు. ధాన్యం తరలించేందుకు ఒక్కో సెక్టార్ కు 40 లారీలు అందుబాటులో ఉండాలి. లారీలకు దూరాన్ని బట్టి ఐదు శ్లాబ్​లుగా విభజించి టెండర్లను పిలిచారు. ఒక్కో సెక్టార్ కు ఆయా లారీ ట్రాన్స్ పోర్టర్లు పోటీ పడగా, కిలోమీటర్ల చొప్పున తక్కువ రేటుకు టెండర్ దాఖలు చేసిన వారిని ఫైనల్ చేశారు. 8 కిలోమీటర్లలోపు ఉన్న మిల్లులకు యావరేజీగా 30 టన్నుల లోడ్ తీసుకెళ్లే లారీకి దాదాపు రూ.9 వేల వరకు కిరాయి చెల్లిస్తున్నారు. దూరాన్ని బట్టి శ్లాబ్ మారితే టన్నుకు కిలోమీటర్ కు 30 పైసలు చొప్పున రేటు పెంచుతారు. 
.
మిల్లర్ల తీరుతో అన్ లోడింగ్ ఆలస్యం..

ఒకవైపు లారీల రవాణా ఆలస్యం కావడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతుండగా, మరోవైపు మిల్లుల్లో అన్ లోడింగ్ ఆలస్యం కావడంతో తాము ఇబ్బంది పడుతున్నామని లారీ కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఒక్కో మిల్లు దగ్గర అన్ లోడ్ అయ్యేందుకు ఐదు నుంచి ఏడు రోజుల వరకు టైమ్ పడుతుందని, దీని వల్ల సకాలంలో కొనుగోలు కేంద్రాలకు రాలేకపోతున్నామని చెబుతున్నారు. ఒక్కో మిల్లు దగ్గర ఐదారు రోజులున్న తర్వాత బస్తాల్లో శాంపిల్ చూసి తేమ శాతం ఎక్కువగా ఉందని మిల్లర్లు చెబుతూ.. బస్తాకు కిలో తగ్గిస్తేనే అన్ లోడ్ చేసుకుంటామని కొర్రీలు పెడుతున్నారు. ఇన్ని రోజులు మిల్లుల దగ్గరే వేచి చూడడం వల్ల తమకు కిరాయి గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. దీంతో లారీలు ఆలస్యం అవుతుండడంతో రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. 

లారీల కొరత తీరట్లే..

ఆఫీసర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లారీల కొరత మాత్రం తీరడం లేదు. జిల్లాలో మొత్తం 326 కొనుగోలు కేంద్రాలకు కేవలం 250 లారీలను మాత్రమే కాంట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం లారీల కొరత రానివ్వకుండా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు వడ్లు రవాణా చేయాలి. కానీ అన్ లోడింగ్ పేరుతో లారీలు పెట్టడం లేదు. దీంతో గత్యంతరం లేక ఆర్టీఏ ఆఫీసర్లను అడ్డం పెట్టుకొని రోడ్ల పై వెళ్లే ప్రైవేట్ వెహికల్స్ ను దారి మళ్లిస్తున్నారు. అసలు లారీల కాంట్రాక్ట్ టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. లారీలు లేని వాళ్లకు ట్రాన్స్​పోర్టు కాంట్రాక్ట్ ఇచ్చారని, అగ్రిమెంట్ లో పేర్కొన్న దానికి.. ఇప్పుడు సప్లయ్ చేస్తున్న లారీలకు ఏ మాత్రం పొంతన లేదని తెలిసింది. కొనుగోళ్లు చివరి దశకు రావడంతో సెంటర్లకు వడ్లు పోటెత్తుతున్నాయి.