రూ.5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు పాలు అమ్ముతున్నాడు.. డబ్బంతా ఏమైందీ..?

రూ.5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు పాలు అమ్ముతున్నాడు.. డబ్బంతా ఏమైందీ..?

కౌన్ బనేగా కరోడ్ పతీ.. టాలెంట్ ఉంటే.. మీరు తెలివిగల వాళ్లు అయితే కోట్లు సంపాదించొచ్చు.. తాను చదివిన చదువుకు.. ఉన్న జ్ణానానికి అమితాబచ్చన్ నిర్వహించే కేబీసీ.. కౌన్ బనేగా కరోడ్ పతి షోకు సెలక్ట్ అయ్యాడు సుశీల్ కుమార్. బీహార్ రాష్ట్రానికి చెందిన సుశీల్ కుమార్.. 2011లో ఈ షో ద్వారా ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు. దీంతో అతని జీవితమే మారిపోయింది. అప్పటి వరకు సాధాసీదా జీవితం గడిపిన సుశీల్ కుమార్.. రాత్రికి రాత్రి కోటేశ్వరుడు అయ్యాడు. 

కేబీసీతో వచ్చిన 5 కోట్లతోపాటు.. అతని స్నేహితులు పెరిగారు.. బంధువులు పెరిగారు.. సమాజంలో ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు. సుశీల్ కుమార్ కు వచ్చిన పాపులారిటీలతో స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు మరింతగా అతన్ని ప్రోత్సహించాయి. స్కూల్స్, కాలేజీలు, సభలు, సమావేశాలకు తీసుకెళ్లింది. రాత్రికి రాత్రి స్టార్ అయ్యాడు కదా.. సుశీల్ కుమార్ కూడా వెనకా ముందూ చూడలేదు.. తన దగ్గర ఉన్న డబ్బును విరాళాలుగా ఇస్తూ.. పేపర్లు, టీవీల్లో కనిపిస్తూ ఎంజాయ్ చేశాడు. 

అంతేకాదు.. కొత్త ఫ్రెండ్స్ తోపాటు కొత్త అలవాట్లు పుట్టుకొచ్చాయి. రాత్రులు మందు పార్టీలు మొదలయ్యాయి. అలా నాలుగేళ్లలోనే 5 కోట్ల రూపాయలు అయిపోయాయి. భార్య వదిలేసి వెళ్లిపోయింది. సుశీల్ కుమార్ దగ్గర డబ్బు లేదని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు, ప్రజా సంఘాలు, స్వచ్చంధ సంస్థలు పట్టించుకోవటం మానేశాయి. సింపుల్ గా చెప్పాలంటే డబ్బు లేకపోవటంతో సమాజం చిన్నచూపు చూసింది. భార్య లేదు.. అందరూ దూరం పెట్టారు. దీంతో బతకటం కోసం రెండు గేదెలు పెట్టుకుని పాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు సుశీల్ కుమార్. 

2011లో ఐదు కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్.. 2020 నాటికి దివాళా తీశాడు. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులు చేశాడు. జీవనం కూడా నిన్నటి వరకు పాలు అమ్మాడు.. సుశీల్ కుమార్ లో ఎటూ టాలెంట్ ఉండటంతో.. ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం టీచర్ ఉద్యోగం ఇచ్చింది. ఓ వైపు పాల వ్యాపారం, మరో వైపు టీచర్ ఉద్యోగం చేసుకుంటూ.. పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాడు సుశీల్ కుమార్. 

డబ్బు.. డబ్బు.. డబ్బు.. అది ఉంటే మన చుట్టూ ఎలా ఉంటుంది.. డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది అనే దానికి సుశీల్ కుమార్ జీవితం ఓ చక్కటి ఉదాహరణ. మంచి చదువు ఉండటంతో ప్రస్తుతం ఈ మాత్రం స్థిరపడ్డాడు.. లేకపోతే ఏమయ్యేవాడు.. కౌన్ బనేగా కరోడ్ పతిలో డబ్బులు సంపాదించి జీవితం నాశనం చేసుకున్న వారిలో సుశీల్ కుమార్ ఒక్కరే కావటం విశేషం.