తాను లవ్  చేసిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్నేహితుని హత్య

తాను లవ్  చేసిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్నేహితుని హత్య

నందిపేట, వెలుగు :  తాను ప్రేమిస్తున్న అమ్మాయిని తన మిత్రుడు కూడా ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో అన్నదమ్ములు ఇద్దరూ కలిసి అతడిని హత్యచేశారు. మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో రాళ్ల మధ్య పడేశారు. ఏడాదిన్నర తర్వాత మృతుడి మిత్రులతో పాటు నిందితుల మిత్రులు కూడా ఇచ్చిన సమాచారంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ శ్రీకాంత్​  బుధవారం వెల్లడించారు. నిజామాబాద్  జిల్లా నందిపేట మండలం ఆంధ్రా నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో సౌతురి వెంకటరమణమ్మ తన కుటుంబంతో కలిసి  నివాసముంటున్నది. 2021 సెప్టెంబర్​ 20 నుంచి ఆమె చిన్న కుమారుడు  సౌతురి కార్తీక్​ (21) కనబడకుండా పోయాడు. అతను కూలిపనులు చేసుకుంటూ బతికేవాడు. పని కోసం వివిధ ఊర్లకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆంధ్రాలో ఎక్కడైనా పనికి వెళ్లి ఉంటాడని  భావించి అతని గురించి వెతకలేదు. అంతేకాకుండా కార్తీక్  చదువుకోలేదు. అతని వద్ద ఫోన్  కూడా లేదు. అయితే తన కొడుకు కనబడకుండా పోయిన రోజు అదే కాలనీకి చెందిన రాజు, అతని తమ్ముడు హరీశ్..  కార్తీక్ ను నందిపేట శివారులోని ఎల్లమ్మ ఆలయం దగ్గరకు తీసుకెళ్లి  మద్యం తాగించారని వెంకటరమణమ్మకు రెండు రోజుల క్రితం తెలిసింది. దీంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడి స్నేహితులతో పాటు నిందితుల స్నేహితులను కూడా విచారించారు.

వారిచ్చిన సమాచారంతో బుధవారం ఘటనా స్థలానికి  వెళ్లి చూడగా  కార్తీక్​ అస్తిపంజరం, దుస్తులు లభించాయి. రాజు ప్రేమిస్తున్న అమ్మాయినే కార్తీక్​ కూడా ప్రేమిస్తున్నాడనే అనుమానంతో  అన్నదమ్ములు ఇద్దరూ కలిసి కార్తీక్​కు మద్యం తాగించారు. అనంతరం విజయనగరం గుట్టల్లోకి తీసుకెళ్లి కర్రలతో తలపై బాది హత్యచేశారు. శవాన్ని బండరాళ్ల మధ్యలో పడేశారు. ఇన్ని రోజులు హత్య విషయం బయటపడకుండా జాగ్రత్త పడినప్పటికీ మృతుడి స్నేహితులతో పాటు నిందితుల స్నేహితులు ఇచ్చిన సమాచారంతో  హత్య విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్ఐ శ్రీకాంత్  చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.