
రంగారెడ్డి జిల్లా మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో 36 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. అందులో 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో నిందితులను జడ్జి ముందు హాజరపరుచనున్నారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ నుంచి ముందుగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. అయితే దాడి కేసులో AI నిందితుడు నవీన్, A2 రూమన్, A4 సిద్దు, A5 చందులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. పోలీసులు ఆయన అరెస్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాత్రం.... పోలీసులు నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అయితే నవీన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామన్నారు పోలీసులు. అరెస్ట్ చేసిన నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులు పెట్టామన్నారు.
మరోవైపు దాడికి సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారంటూ పలువురు ఆదిబట్ల పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. అరెస్ట్ అయిన వారిలో ఓ పాన్ షాప్ యువకుడు ఉన్నట్లు తెలిపారు అతని సోదరుడు. గొడవ జరిగిన టైంలో మక్రమ్ ఇంట్లో ఉన్నాడంటున్నారు. సాయంత్రం షాపు తెరిసిన తర్వాత... పోలీసులు వచ్చి తీసుకెళ్లినట్లు ఆరోపిస్తున్నాడు మక్రమ్ సోదరుడు సాజిద్.
తమ ఇంట్లో దారుణంగా వ్యవహరించి అమ్మాయిని తీసుకెళ్లినా పోలీసులు ఏమీ చేయలేకపోయారని యువతి తండ్రి ఆరోపించారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి రాజకీయ అండదండలు ఉన్నాయన్నారు.
తమ కొడుకు దగ్గర యువతి డబ్బులు తీసుకుందని నవీన్ రెడ్డి తల్లి నారాయణ ఆరోపించారు. తన కొడుకుతో కారు ఇప్పించుకున్నారని చెప్పింది. అమ్మాయి, అబ్బాయి కలిసి గోవాకు కూడా వెళ్లారని, పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలిసిందని తెలిపింది. మీడియాతో మాట్లాడుతూనే నారాయణమ్మ సొమ్మసిల్లి కింద పడిపోయారు.
నిన్న అసలేం జరిగిందంటే..?
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం ఓ యువతి కిడ్నాప్ నకు గురైందనే వార్త కలకలం రేపింది. తమ కూతురుని నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వచ్చిదాడి చేసి, తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తూర్కయాంజల్ మున్సిపాలిటీ రాగన్న గూడలో ఈ ఘటన జరిగింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ కూతురిని మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి తీసుకెళ్లాడని యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 100 మందికిపైగా యువకులతో నవీన్ రెడ్డి.. తమ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులపై దాడిచేసి తమ కూతురిని బలవంతంగా తీసుకెళ్లాడని చెప్పారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు ధ్వంసం చేశారని తెలిపారు. అడ్డు వచ్చిన వారందరిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.