బిహార్లో కూటమి సీఎం అభ్యర్థిపై సస్పెన్స్.. తేజస్వీకి ప్రత్యామ్నాయం లేదంటున్న ఆర్జేడీ..

బిహార్లో కూటమి సీఎం అభ్యర్థిపై సస్పెన్స్..  తేజస్వీకి ప్రత్యామ్నాయం లేదంటున్న ఆర్జేడీ..
  • సీఎం ఫేస్​తోనే ఎన్నికలకు వెళ్లాలని నేతల పట్టు.. 
  • కూటమిలో పార్టీలన్నీ  చర్చించి నిర్ణయిస్తాయంటున్న కాంగ్రెస్

పాట్నా: బిహార్​లో ప్రతిపక్ష కూటమి ‘మహాఘట్ బంధన్‌‌‌‌’లో సీఎం అభ్యర్థి ఎంపికపై అనిశ్చితి నెలకొంది. ఆర్‌‌‌‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌‌‌‌ సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ కోరుకుంటున్నది. కాంగ్రెస్ దీనిపై ఎటువంటి స్పందన తెలియజేయకుండా మౌనం వహిస్తున్నది. సీఎం అభ్యర్థిని ప్రకటించే ఎన్నికలకు వెళ్తామని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తేజస్వీ ప్రకటించారు. మరోవైపు సీఎం అభ్యర్థిపై మహాఘట్​బంధన్​లోని పార్టీలన్ని సమష్టిగా నిర్ణయం తీసుకుంటాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలకు మరో 30 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఈ అనిశ్చితి ఇండియా బ్లాక్​ నేతల్లో, కార్యకర్తల్లో టెన్షన్ పెంచుతున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత ఉదిత్ రాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తేజస్వీ యాదవ్ ఆర్‌‌‌‌జేడీ పార్టీ సీఎం అభ్యర్థి కావచ్చు. అయితే ఇండియా బ్లాక్ సీఎం ఫేస్ ఎవరనేది కూటమిలోని పార్టీలు నిర్ణయిస్తాయి. కాంగ్రెస్ హైకమాండ్​ ఏం నిర్ణయిస్తుందో చూద్దాం” అని అన్నారు. ఉదిత్​రాజ్​ కామెంట్లపై ఆర్జేడీ  కానీ, తేజస్వీ యాదవ్​ కానీ ఇంకా స్పందించలేదు.

తేజస్వీ మినహా ఆప్షన్ లేదు

తేజస్వీ యాదవ్​ సారథ్యంలో 2020 ఎన్నికలకు వెళ్లిన ఆర్జేడీ పార్టీ 75 సీట్లు గెలిచింది. అధికార బీజేపీ-–జేడీయూ కూటమిని ఓడించాలంటే తేజస్వీ మాత్రమే ఆప్షన్ అని ఆర్జేడీ పార్టీ నేతలు అంటున్నారు. అయితే, దీనిపై కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. ఆగస్టు నెలలో బిహార్​అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. ‘‘దానిపై ఇండియా బ్లాక్​లో చర్చ జరుగుతున్నది. మేం కలసి పోటీ చేస్తం. మంచి రిజల్ట్ వస్తుంది” అంటూ స్కిప్ చేశారు. ఆ సమయంలో వేదికపై తేజస్వీ ఆయన పక్కనే కూర్చొని ఉన్నారు. మరోవైపు, బిహార్​లో కాంగ్రెస్ ​పార్టీకి ఉన్న జూనియర్ పార్ట్​నర్​అనే ముద్రను తొలగించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ బిహార్​లో నిర్వహించిన యాత్రలు, సభల ద్వారా కాంగ్రెస్ బలం పుంజుకున్నట్టు ఇటీవలి సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.