తొమ్మిది ఓకే.. ఒకటి పెండింగ్​

తొమ్మిది ఓకే.. ఒకటి పెండింగ్​
  • కాంగ్రెస్​ అభ్యర్థుల రెండో జాబితా విడుదల 
  • ఉమ్మడి జిల్లాలో తొమ్మిది సెగ్మెంట్లలో ఖరారు..చెన్నూర్ పెండింగ్ 
  • ఆదిలాబాద్ లో సీనియర్లను కాదని కంది వైపే మొగ్గు
  • ఎమ్మెల్యే రేఖ నాయక్ కు షాక్ ..  భర్త శ్యామ్ నాయక్ కు టికెట్

ఆదిలాబాద్, వెలుగు : కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ రెండో జాబితాపై ఉత్కంఠకు తెరపడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మొదటి  జాబితాలో ముగ్గురు పేర్లు ఖరారు చేయగా, రెండో జాబితాలో ఆరుగురి పేర్లను ఖరారు చేసింది. చెన్నూర్ నియోజకవర్గాన్ని పార్టీ హైకమాండ్​ పెండింగ్ లో పెట్టింది. రెండో జాబితాలో ఆదిలాబాద్ నియోజకవర్గం కంది శ్రీనివాస్ రెడ్డి, బోథ్ నియోజకవర్గంలో డాక్టర్ వెన్నెల అశోక్, ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ నుంచి శ్యామ్ నాయక్, సిర్పూర్ నుంచి రావి శ్రీనివాస్, ముథోల్ లో నారాయణరావు పటేల్ కు టికెట్ దక్కింది. మొదటి జాబితాలో బెల్లం పల్లిలో గడ్డం వినోద్, మంచిర్యాలలో  ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్​లో  శ్రీహరిరావుకు టికెట్టు కేటాయించింది. 

ముగ్గురిని ఢీకొట్టి ముందుకొచ్చాడు..

ఆదిలాబాద్​ అసెంబ్లీ సెగ్మెంట్​లో కాంగ్రెస్​ అభ్యర్థి ఎవరన్న అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నియోజకవర్గంలో ముగ్గురు సీనియర్లు టికెట్ కోసం ప్రయత్నాలు చేయగా చివరకు ఆరు నెలల కిందనే పార్టీలో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కన్ఫామ్​ అయ్యింది.  డీసీసీ అధ్యక్షుడు సాజిద్‍ఖాన్, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి తమ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని హైకమాండ్​కు చెప్పారు.  కొత్తగా చేరిన కంది శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వకూడదంటూ గట్టిగా చెప్పారు.  ఆయనకు టికెట్ ఇస్తే తాము పార్టీలో పనిచేయమంటూ హెచ్చరించారు.

ఒక దశలో గాంధీ భవన్​ ఎదుట ఆదిలాబాద్ కార్యకర్తలు ఆందోళనలు సైతం చేసినప్పటికీ ఆ ముగ్గురు సీనియర్లని ఢీకొని కంది టికెట్ దక్కించుకోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు కందికి ఈ ముగ్గురు సపోర్టు చేస్తారా.. పార్టీ మారుతారా అనే చర్చ నడుస్తోంది. అటు బోథ్ నియోజకవర్గంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీ టికెట్ వస్తుందని ఆశపడినప్పటికీ ఆయనను  కాదని డాక్టర్​ వన్నెల అశోక్ కు టికెట్ కేటాయించారు. మరి ఎమ్మెల్యే రాథోడ్​ బాపురావుకు హైకమాండ్​ నుంచి ఎలాంటి హామీ దక్కుతుందనేది చూడాలి. 

భర్తకు ఓకే.. భార్యకు నో..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, బోథ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్ ఇవ్వడంతో ఆ ఇద్దరు పార్టీ మారారు. ముఖ్యంగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ కాంగ్రెస్ టికెట్ వస్తుందనే ఆశతోనే ఆ పార్టీలో చేరారు. అయితే ఆమె భర్త శ్యామ్ నాయక్ సైతం తన ఉద్యోగానికి వదిలేసి కాంగ్రెస్ లో చేరడంతో పాటు ఆసిఫాబాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్ట హైకమాండ్​ భర్తకే టికెట్ ఇచ్చి  రేఖ నాయక్ కు మొండి చేయిచూపింది. ఇక్కడ ఆదివాసీ నేత వెడ్మ బొజ్జుకు టికెట్  ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే రేఖ నాయక్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇటు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రేఖ నాయక్ ఇక ఎంపీ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. 


‘చెన్నూర్’ ఎవరిదో..?

కాంగ్రెస్ పొత్తులో భాగంగా చెన్నూర్ నియోజకవర్గం టికెట్ సీపీఐ పార్టీకి కేటాయిస్తారని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుతో పాటు డాక్టర్ రాజరమేశ్, నూకల రమేశ్, మరికొందరు లీడర్లు టికెట్ ఆశిస్తున్నారు. రెండో జాబితాలో కూడా పేర్లు రాకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉండటంతో సీటు వదుకోవద్దంటూ ఆ పార్టీ శ్రేణులు నిరసన సైతం తెలిపారు. పొత్తులో భాగంగా సీపీఐ బెల్లంపల్లి టికెట్ ఇవ్వాలని కోరినప్పటికీ అది మొదటి లిస్ట్ లో కాంగ్రెస్ కు కేటాయించారు. ఇప్పుడు తాము ప్రతిపాదన చేయని సీటు తమకు ఇస్తారా అనే అసంతృప్తి కూడా సీపీఐ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. రెండో జాబితాలో సైతం పెండింగ్ పెట్టడంతో రెండు పార్టీల అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.