బీఆర్ఎస్ ​మీటింగ్​కు హాజరైన .. 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్

బీఆర్ఎస్ ​మీటింగ్​కు హాజరైన .. 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్
  •  ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ చర్యలు
  •  ఫీల్డ్​లో మద్దతు కోసం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి స్కెచ్​
  •  విషయం బయటపడడంతో ఈసీ కన్నెర్ర.. నష్టపోయిన ఉద్యోగులు
  •  రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో కలకలం

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుపడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.మను చౌదరి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్​లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ పి.వెంకట్రాంరెడ్డి నిర్వహించిన సమావేశానికి సెర్ప్​కు సంబంధించి 14 మంది ఏపీఎంలు-, 18 మంది సీసీలు, నలుగురు వీవోఏలు-, ఒక సీవో, మరో సీబీ ఆడిటర్​తో కలిపి మొత్తం 38 మంది వచ్చారు. 

అలాగే ఈజీఎస్ కు సంబంధించి -నలుగురు ఏపీవోలు, ఏడుగురు ఈసీలు, -38 మంది టీఏలు, 18 మంది సీవోలు, మరో ఎఫ్ఏతో కలిపి 68 మంది హాజరయ్యారు. ఈ విషయం వెలుగు చూడడంతో సిద్దిపేట అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీవో విచారణ జరిపారు. రెడ్డి ఫంక్షన్ హాల్​లో సీసీ ఫుటేజీ ఆధారంగా బీఆర్ ఎస్ మీటింగ్​లో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి మొత్తం 106 మందిని సస్పెండ్​చేశారు.

అబద్ధాలు చెప్పి మీటింగ్​కు పిలిచిన్రు 

సెర్ప్​, ఈజీఎస్ ఉద్యోగులకు ఆయా ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఫోన్లు రావడంతో సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్​కు వచ్చినట్లు తెలుస్తున్నదని. కొందరికి ఫంక్షన్ ఉందంటూ, మరికొందరికి జిల్లా బాడీ ఏర్పాటు కోసం చర్చిద్దామని ఆహ్వానించడంతో వారు హాజరయ్యారని చెప్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్ గా పనిచేయడంతో సెర్ప్​, ఈజీఎస్ విభాగాల్లో పనిచేసే అధికారులతో ఉన్న సంబంధాలను ఆసరాగా చేసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంకట్రాంరెడ్డితో సమావేశం ఉందంటే సిబ్బంది రారనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. మీటింగ్ ను ఆయా ఉద్యోగ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసే కొందరు లీడర్లు ముందుండి ఈ వ్యవహారం నడపగా బీఆర్ఎస్ లీడర్లు అండదండలు అందించినట్టు తెలుస్తున్నది. రెడ్డి ఫంక్షన్ హాల్ కు చేరుకున్న తర్వాత అక్కడ అసలు విషయం తెలిసినా.. ఏమీ చేయలేక మిన్నకుండి పోయినట్టు సమాచారం.

సమావేశం వీడియోలు బయటకు.. 

ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డి మాట్లాడుతుండగా కొందరు వీడియోలు తీసి షేర్​చేయడంతో గుట్టు బయటపడింది. అయితే, తమకు కనీస సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యేలా చేసిన ఉద్యోగ సంఘాల లీడర్లపై గుర్రుగా ఉన్న కొందరు ఉద్యోగులే ఈ పని చేసినట్టు తెలుస్తున్నది. ఈ వీడియోలు వాట్సాప్ ​ద్వారా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు చేరడంతో ఆయన కలెక్టర్, సీపీలకు పంపించారు. కాగా, రెడ్డి ఫంక్షన్ హాల్​లో కేవలం డీఆర్డీఏకు చెందిన ఉద్యోగులతోనే సమావేశం నిర్వహించారని, పట్టణంలోని మరో రెండు ఫంక్షన్ హాల్స్ కు ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెడ్డి ఫంక్షన్ హాల్ కు చేరుకున్న విషయం తెలుసుకుని మిగిలిన ఫంక్షన్ హాల్స్ లోని ఉద్యోగులు వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది.

ఉద్యోగ వర్గాల్లో కలకలం

ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి వెళ్లిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడటం ఉద్యోగ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది. ఒకేసారి 106 మందిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు వెలువడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉద్యోగ సంఘాల నేతలు తప్పుడు సమాచారం ఇచ్చి సమావేశానికి రప్పించడం వల్ల అమాయకులు నష్టపోయారని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఫీల్డ్​లో మద్దతు కోసం స్కెచ్

సెర్ప్​, ఈజీఎస్ ఉద్యోగుల మద్దతుతో ఎన్నికల్లో ఓట్లు దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ​భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. జిల్లాలో 18,262 సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో 1,93,513 మంది, 4,06,124 ఈజీఎస్ కూలీలు ఉన్నారు. సెర్ప్​, ఈజీఎస్ లోని వివిధ భాగాల్లో ఫీల్డ్​లెవెల్​లో పనిచేసే వారిని మచ్చిక చేసుకుని గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసే విధంగా మోటివేట్​చేయడమే ఈ మీటింగ్​ప్రధాన ఉద్దేశమని తెలిసింది. 

సమావేశంలో జిల్లా కలెక్టర్ గా ఉన్న టైమ్​లో వెంకట్రాంరెడ్డి చేసిన సేవలను క్షేత్ర స్థాయిలో వివరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా ఓట్లు పడే విధంగా మహిళా గ్రూపు సభ్యులను, ఈజీఎస్ కూలీలను సిద్ధం చేయాలని సూచించినట్టు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది ఉద్యోగులు గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తూ ఆయా సంఘాల సభ్యులు, కూలీలతో మంచి సంబంధాలు ఉండడంతో దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని చూసినట్టు సమాచారం.