జలసిరిని ఒడిసిపట్టి కుంటలు తవ్వి వర్షపు నీటి నిల్వ

జలసిరిని ఒడిసిపట్టి  కుంటలు తవ్వి వర్షపు నీటి నిల్వ
  • సాగులోకి 30 ఎకరాల బీడు భూములు 
  • డ్రిప్ ద్వారా పండ్లు, కూరగాయ పంటలు, పువ్వుల తోటలు 
  • తునికి కేవీకేలో సత్ఫలితలిస్తున్న సైంటిస్టుల ఆలోచన 
  • నీటి కొరత లేకుండా రెండు పంటలు సాగు 
  • జల సంరక్షణపై రైతులకు అవగాహన

మెదక్ / కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు బోర్ల మీద ఆధారపడకుండా, వృథాగా పోయే వర్షపు నీటిని సంరక్షించి పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. శాస్త్రవేత్తలు నల్కర్, ప్రతాప్ రెడ్డి, రవికుమార్, శ్రీనివాస్, ఉదయ్ కుమార్, శ్రీకాంత్, భార్గవి, ఫామ్ మేనేజర్ భానుచందర్ ఆలోచన చేసి పొలాల  సమీపంలో నాలుగు నీటి కుంటలను తవ్వించారు. వర్షం పడినపుడు నీరు వృథాగా పోకుండా ఆ కుంటల్లోకి చేరే ఏర్పాటు చేశారు. 

వాటికి సమీపంలో పెద్ద సైజు ఫాంపాండ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిసి కుంటలు పూర్తిగా నిండినపుడు ఎక్కువయ్యే నీరు ఈ ఫాంపండ్ లోకి చేరుతుంది. పొలాల చుట్టూ కందకం తవ్వించి వర్షం నీరు భూమిలోకి ఇంకెలా చూస్తున్నారు. తద్వారా భూమి ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఇలా కుంటల ద్వారా ఒడిసి పట్టిన వర్షపు నీటిని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పొలాలకు అందిస్తూ 30 ఎకరాల్లో పండ్ల తోటలు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా ఎండా కాలంలో సైతం పంటలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చేశారు. 

ఆరోగ్యకరమైన పంటలు 

డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీటిని అందిస్తూ మామిడి, బొప్పాయి తోటలతో పాటు, టమాటా, వంకాయ, పాలకూర తదితర కూరగాయల పంటలు పండిస్తున్నారు. ఆయా పంటలకు రసాయనిక ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులు మాత్రమే వినియోగిస్తున్నారు. తద్వారా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులను వ్యవసాయ శాఖ అధికారులు కేవీకే కు తీసుకు వచ్చి వర్షపు నీటిని వృథాగా పోకుండా ఎలా సంరక్షించు కోవచ్చు, ఆ నీటిని పొదుపుగా పంటల సాగుకు ఎలా వినియోగించుకోవచ్చో ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ ఒక్క రైతు ఈ విధంగా చేస్తే సాగు నీటి కొరత లేకుండా, రెండు పంటలు పండించుకోవచ్చని తెలియజేస్తున్నారు. అంతేగాక వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గకుండా ఉండి, బోర్లు రీఛార్జ్ అయ్యి పంటల సాగుకు ఢోకా ఉండదని సూచిస్తున్నారు. 

నీటి వృథాను అరికట్టేందుకు 

వర్షం పడినపుడు భూమిపై పడిన నీరు పెద్ద మొత్తంలో వృథాగా పోతోంది. అందుకే ఆ నీటిని ఒడిసి పట్టేందుకు నీటి కుంటలు నిర్మించాం. తద్వారా వృథాగా ఉన్న భూములను సాగు యోగ్యంగా తీర్చిదిద్ది నీటి కొరత లేకుండా రెండు పంటలను పండించే ఏర్పాటు చేశాం. - ఉదయ్ కుమార్, సైంటిస్ట్  

డ్రిప్ తో నీటి పొదుపు

వర్షపు నీటిని సంరక్షించి నిల్వ చేయడం ఎంత ముఖ్యమో ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం అంతే ముఖ్యం. అందుకోసం పంటల సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అవలంభిస్తున్నాం. ఈ విధానం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. పండ్ల తోటలు, కూరగాయ పంటలకు ఈ విధానం ఎంతో మేలు. ‌‌‌‌- శ్రీనివాస్ గౌడ్, సైంటిస్ట్