అణు నిర్మాణాలపై రీసెర్చ్కు కెమిస్ట్రీ నోబెల్.. జపాన్, బ్రిటన్, జోర్డాన్కు చెందిన ముగ్గురు సైంటిస్టులకు అవార్డు

అణు నిర్మాణాలపై రీసెర్చ్కు కెమిస్ట్రీ నోబెల్.. జపాన్, బ్రిటన్, జోర్డాన్కు చెందిన ముగ్గురు సైంటిస్టులకు అవార్డు
  • మెటల్ -ఆర్గానిక్ ఫ్రేంవర్క్​లను సృష్టించినందుకు గుర్తింపు 
  • వీటితో ఎడారిలో గాలి నుంచి నీటిని ఒడిసిపట్టొచ్చు 
  • సీవోటూ, విష వాయువులను క్యాప్చర్ చేసేందుకూ ఉపయోగం

స్టాక్ హోం(స్వీడన్): రసాయన అణువుల్లో కొత్త రకం నిర్మాణాలను అభివృద్ధి చేసిన ముగ్గురు సైంటిస్టులను ఈ ఏడాది కెమిస్ట్రీ నోబెల్ వరించింది. జపాన్​కు చెందిన సుసుము కిటాగవా, బ్రిటన్​కు చెందిన రిచర్డ్ రాబ్సన్, జోర్డాన్​కు చెందిన ఒమర్ ఎం. యాఘీని 2025 కెమిస్ట్రీ నోబెల్​కు ఎంపిక చేసినట్టు బుధవారం నోబెల్ కమిటీ ప్రకటించింది. లోహపు అయాన్​లు, ఆర్గానిక్ అణువులతో కూడిన నిర్మాణాలైన ‘మెటల్–ఆర్గానిక్ ఫ్రేంవర్క్’ల అభివృద్ధికి వీరు విశేష కృషి చేశారని ప్రశంసించింది.

వీరు ముగ్గురూ 3 దశాబ్దాల కిందట వేర్వేరుగానే పరిశోధనలు చేసినప్పటికీ, ఒకరి తర్వాత ఒకరు ఈ అంశంలో మార్గదర్శకులుగా నిలిచారని తెలిపింది. ‘‘వాయువులు, కెమికల్స్ పెద్ద ఎత్తున ప్రవహించేలా వీరు ప్రత్యేక అణు నిర్మాణాల(మెటల్-- ఆర్గానిక్ ఫ్రేం వర్క్స్)ను సృష్టించారు. ఎడారి గాలి నుంచి నీటిని ఒడిసిపట్టేందుకు, కార్బన్ డయాక్సైడ్, విషపూరిత వాయువులను క్యాప్చర్ చేసేందుకు, రసాయన చర్యలకు ఉత్ప్రేరకంగా నిలిచేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి” అని నోబెల్ కమిటీ కొనియాడింది.

కాగా, సుసుము కిటాగవా(74) జపాన్​లోని క్యోటోలో 1951లో జన్మించారు. 1979లో క్యోటో వర్సిటీ నుంచి పీహెచ్​డీ చేశారు. అక్కడే ప్రొఫెసర్​గా పనిచేశారు. రిచర్డ్ రాబ్సన్(88) బ్రిటన్​లోని గ్లస్​బర్న్​లో 1937లో జన్మించారు. 1962లో ఆక్స్​ఫర్డ్​లో పీహెచ్​డీ చేశారు. మెల్​బోర్న్​ వర్సిటీలో ప్రొఫెసర్​గా పనిచేశారు. ఒమర్ ఎం. యాఘీ(60) జోర్డాన్ లోని అమ్మాన్​లో 1965లో జన్మించారు. 1990లో ఇల్లినాయీ వర్సిటీ నుంచి పీహెచ్​డీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. కెమిస్ట్రీ నోబెల్ అవార్డు కింద ఈ ముగ్గురు విజేతలకు 11 మిలియన్ స్వీడిష్  క్రోనార్స్ (రూ. 10.39 కోట్లు)ను సమానంగా పంచుతారు.