బీడీ కార్మికులకు చిప్స్ ప్యాకెట్లు అంటగడుతుండ్రు

బీడీ కార్మికులకు  చిప్స్ ప్యాకెట్లు అంటగడుతుండ్రు

కోరుట్ల, వెలుగు: బీడీ కార్మికులకు ఇష్టం లేకున్నా కంపెనీ ద్వారా చిప్స్ ప్యాకెట్లను ఇస్తున్నారని ఏఐటీయూసీ అనుబంధ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సుతారి  రాములు అన్నారు. శనివారం కోరుట్ల లోని ప్రభాకర్​భవన్​లో ఆయన మాట్లాడారు. దేశాయి బ్రదర్స్ కంపెనీ లిమిటెడ్ ఫ్యాక్టరీ కోరుట్ల రేంజ్ లోని కోరుట్ల, మెట్​పల్లి,  రాయికల్, మన్నెగూడెం, తాండ్ర్యాల, రుద్రంగి సెంటర్ల పరిధిలో 200 బ్రాంచీల్లో 10 వేల మంది బీడీ కార్మికులు పని చేస్తుంటారని పేర్కొన్నారు.  దేశాయి బీడీ కంపెనీకి చిప్స్ ప్యాకెట్ల కంపెనీ ఉందన్నారు.  2 నెలల నుంచి ఈ ప్యాకెట్లను కోరుట్ల రేంజ్ నుంచి ఇతర సెంటర్లకు  పంపిణీ చేయాలని కంపెనీ మేనేజ్​మెంట్​ ఆదేశాలు జారీ చేసిందన్నారు.  ప్రతి బీడీ కార్మికురాలికి దాదాపు రూ.100 చిప్స్ ప్యాకెట్లను బలవంతంగా కట్టబెడుతూ డబ్బులు వసూలు చేస్తూన్నారని ఆరోపించారు.

చిప్స్​ తినడం వల్ల కార్మికుల పిల్లలు అనారోగ్యానికి గురువుతున్నారన్నారని ఆరోపించారు. బీడీ కార్మికులకు ప్యాకెట్లను ఇస్తూ ఆర్థికంగా నష్టం చేస్తున్నారని విమర్శించారు.  కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేసి, బీడీ కంపెనీ యజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను  కోరారు.  లేకపోతే  కార్మికులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కొక్కుల శాంత, జిల్లా కోశాధికారి ఎండీ ముక్రం, ఎన్నం రాధ, అశోక్, పద్మ, భాగమ్మ, గణేష్,  రామయ్య, వంశీకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.