కరోనా టెస్టు చేస్తుండగా సర్పంచ్ ముక్కులో విరిగిన స్వాబ్​ స్టిక్

కరోనా టెస్టు చేస్తుండగా సర్పంచ్ ముక్కులో విరిగిన స్వాబ్​ స్టిక్

రామడుగు, వెలుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావ్​పల్లి సర్పంచ్​కు కరోనా టెస్టు చేస్తుండగా స్వాబ్ ​స్టిక్(టెస్ట్ ​చేసే పుల్ల) విరిగి ముక్కులో ఇరుక్కుపోయింది. సిబ్బంది బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ రాలేదు. వెంటనే కరీంనగర్​ తరలించగా అక్కడి డాక్టర్ ​ఎండోస్కోపి ద్వారా బయటికి తీశారు. గ్రామస్తులు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్​రావుపేట పీహెచ్​సీ ఆధ్వర్యంలో శుక్రవారం వెంకట్రావ్​పల్లిలోని పంచాయతీ ఆఫీస్​వద్ద కరోనా టెస్టులు చేశారు. సర్పంచ్​ శేఖర్​కు టెస్టు చేస్తుండగా స్వాబ్​ స్టిక్ విరిగి దానికి చుట్టిన దూదితో సహా ముక్కులోనే ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న డాక్టర్, సిబ్బంది తీసేందుకు ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. స్థానికులు వెంటనే కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ఈఎన్​టీ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్​పరిశీలించి ముక్కులో నుంచి గొంతులోకి వెళ్లిందని గుర్తించారు. ఎండోస్కోపి ద్వారా స్వాబ్​స్టిక్, దూదిని బయటకి తీశారు. అనంతరం సర్పంచ్​మాట్లాడుతూ అనుభవం లేని సిబ్బంది టెస్టు చేయడంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. వారి నిర్లక్ష్యంతో నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించానని చెప్పారు. గొంతు నొప్పితో మాట్లాడడం కూడా కష్టమైందని పేర్కొన్నాడు.