
- వ్యాపార సంస్థల నుంచి చెత్త సేకరణలో ఇబ్బందులు పెడుతోందని ఆవేదన
హైదరాబాద్ సిటీ, వెలుగు: తమను రాంకీ సంస్థ ఇబ్బందులకు గురిచేస్తోందని స్వచ్ఛ ఆటో కార్మికుల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం 300 మంది కార్మికులు జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుకు వచ్చి కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ చైర్మన్ రాంపల్లి సూరన్న మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా సిటీలో ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులే.. వ్యాపార సంస్థల నుంచి కూడా చెత్త సేకరిస్తున్నారని తెలిపారు.
కొంతకాలంగా రాంకీ సంస్థ వ్యాపార సంస్థలకు వెళ్లకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. కమర్షియల్ ఏరియాలు, హాస్పిటల్స్, హోటల్స్‌లో చెత్త సేకరించినందుకు జీతాలు ఇస్తామని, నేరుగా వ్యాపార సంస్థల నుంచి డబ్బులు వసూలు చేయొద్దని బెదిరిస్తోందన్నారు. ప్రతి ఒక్క స్వచ్ఛ ఆటో కార్మికుడికి కాలనీలతోపాటు కమర్షియల్ ఏరియాల్లో చెత్త సేకరించేలా చూడాలన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో జేఏసీ లీడర్లు ఎత్తిరి గోపి, బి.రామాంజనేయులు, చిన్న నరసింహ రంగనాయకులు, తిరుమలేశ్, చెక్కరాజు, గుడుల్కాపూర్ యాదగిరి, దేవ, మధు ఉన్నారు.