
హనుమకొండ, వెలుగు: మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ అమలుపై సోమవారం వివిధ శాఖల ఆఫీసర్లతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలతో మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని మహిళలకు 15 రోజుల పాటు నిర్దేశించిన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎంహెచ్వో అప్పయ్య మాట్లాడుతూ మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు వివిధ ప్రభుత్వ విభాగాలు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో జడ్పీ ఇన్ చార్జి సీఈవో రవి, డీపీవో లక్ష్మీ రమాకాంత్, డీఈవో వాసంతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లాలో ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.