లక్షల రూపాయలు పెట్టి కొన్న మిషన్.. మూలకేసిండ్రు

లక్షల రూపాయలు పెట్టి కొన్న మిషన్.. మూలకేసిండ్రు
  •  వృథాగా రూ.44 లక్షల స్వీపింగ్​ మిషన్​
  •  రోడ్ల మీద పేరుకుపోతున్న మట్టి, ఇసుక.. పట్టించుకోని అధికారులు

మెదక్, వెలుగు : మెదక్​ పట్టణంలోని రోడ్ల మీద పేరుకునే మట్టి, ఇసుకను తొలగించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఆరంభంలో రూ.44 లక్షలతో స్మార్ట్​ స్వీపింగ్ మిషన్​ కొన్నారు. దానిని కొన్నాళ్లు వృథాగానే ఉంచారు. ఆ తర్వాత మార్చిలో మంత్రి హరీశ్ రావు ప్రారంభించడంతో కొద్ది రోజులే వాడి మళ్లీ మూలకు పెట్టారు. దీంతో లక్షల రూపాయలు పెట్టి కొన్న మిషన్​ నెలల తరబడి నిరుపయోగంగా ఉండడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

రోడ్లపై భారీగా మట్టి, ఇసుక.. 

మెదక్ పట్టణంలో రోడ్ల మీద పెద్ద మొత్తంలో మట్టి, ఇసుక పేరుకుపోయింది. పట్టణంలో మూడు కిలోమీటర్ల పొడవునా మెయిన్​ రోడ్డు ఉండగా, ఇతర పలు బీటీ రోడ్లు ఉన్నాయి. రోజూ పెద్ద సంఖ్యలో వెహికల్స్​ తిరుగుతుంటాయి. రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఆటో నగర్​ లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇటీవల భారీ వర్షాలు కురిసి ఆ ఏరియాలో మెయిన్​ రోడ్డు మొత్తం జలమయమైంది. మహబూబ్​ నహర్​ కాల్వ పొంగిపొర్లి వెంకట్రావ్​ నగర్, సాయినగర్​ కాలనీల మీదుగా పెద్ద మొత్తంలో వరద రావడంతో ఆటోనగర్​లో రెండు వైపులా మెయిన్​ రోడ్డు మీద భారీగా మట్టి, ఇసుక చేరింది. దీంతో బీటీ రోడ్డు మట్టి రోడ్డులా కనిపిస్తోంది.పెద్ద వెహికల్స్ వెళ్లిననప్పుడు వాహనదారులు, నడుచుకుంటూ వెళ్లేవారిపై దుమ్ము పడుతోంది. ఇసుక కారణంగా కొన్నిచోట్ల బైక్​లు స్కిడ్​ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి స్వీపింగ్​ మిషన్​ ను వినియోగించాలని, పట్టణంలోని రోడ్లన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.