సీఎం కేసీఆర్ చేసిన తీపి కబురు ప్రకటన ఇంకా ఎప్పుడు?

సీఎం కేసీఆర్ చేసిన తీపి కబురు ప్రకటన ఇంకా ఎప్పుడు?

‘‘తెలంగాణ రైతులకు వారంలో అతిపెద్ద తీపి కబురు చెప్పబోతున్న. దేశమే ఆశ్చర్యపడే, అడ్డంపడే వార్త అది. ఆ ఫైనాన్స్అంతా వర్క్అవుట్ అయింది” ఇదీ కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మే 29న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన. ఆ ప్రకటన చేసిన వారం కాదు.. మూడు వారాలు దాటిపోయింది. ఇంత వరకూ ఆ తీపి కబురు ఊసే లేదు. సాగు పనులు మొదలు పెట్టిన రైతులు సీఎం చెప్పే తీపి కబురు ఏమిటని ఎదురు చూస్తూనే ఉన్నారు. అసలు ఆ ముచ్చట ఏందో, ఆ స్కీం ఏందో.. మంత్రులు, ఆఫీసరకు కూడా అంతు పట్టడం లేదు. తీపి కబురు చెప్తానని కేసీఆర్ ప్రకటించినప్పుడు.. ఏ క్షణానైనా దాన్నిలీక్ చేసే చాన్స్ ఉందని మంత్రులు, ఆఫీసర్లు భావించారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ వారిలో ఆశలు సన్నగిల్లాయి. ఎవరికి వారే ‘ఎలాంటి తీపి కబురు’ లేదని సర్ది చెప్పుకుంటున్నారు. కొందరు లీడర్లు కొత్త పథకం అవసరం లేదని, ఉన్న పథకాల్లో కోతలు లేకుండా అమలు చేస్తే చాలంటున్నారు.

మొదట్లో అనేక ఊహాగానాలు

తీపి కబురు ఏమై ఉంటుదనే అంశంపై మొదట్లో ఇటు ప్రభుత్వంలో, అటు టీఆర్ఎస్ లో అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఉచితంగా విత్తనాల పంపిణీ, ఉచితంగా యూరియా పంపిణీ, ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించడం, మద్దతు ధరపై బోనస్ ఇవ్వడం.. వంటి వాటిలో ఏదో ఒకటి సీఎం ప్రకటించొచ్చని చర్చలు నడిచాయి. ‘వారంలో తీపి కబురు’ అంటూ సీఎం చెప్పిన తర్వాత ఆయన అగ్రికల్చర్ పై నాలుగైదు సార్లు రివ్యూ చేపట్టారు. కానీ ఆ రివ్యూల్లో ఎక్కడ కూడా ‘తీపి కబురు’పై చర్చ జరగలేదని ఆఫీసర్లు అంటున్నారు.

కోతలు లేకుండా రైతు బంధు ఇస్తే చాలు

రైతులకు తీపి కబురు చెప్తానన్న కేసీఆర్ ప్రకటనపై టీఆర్ఎస్ లోని కొందరు లీడర్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఏదో ఫ్లోలో మాట్లాడి ఉండొచ్చని, దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవద్దని అనుకుంటున్నారు. ‘‘రైతులకు కొత్తగా తీపి కబురు వద్దు. రైతుబంధులో కోతలు పెట్టొద్దు . మేం కొన్నిఊర్లళ్లకు పోయినప్పుడు రైతు బంధు పైసలు రావట్లేదని రైతులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాం”అని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి తన సన్నిహితుల వద్ద కామెంట్ చేశారు. పల్లెల్లో సగం మంది రైతులకు రైతు బంధు డబ్బులు రాలేదని, దీంతో తమకు చాలా ఇబ్బందిగా మారిందని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అన్నారు.

రుణమాఫీ ఏమాయె?

లక్ష రూపాయల రుణమాఫీపై రాష్ట్ర ప్ర భుత్వంలో ఎలాంటి కదలిక లేదు. తొలి విడతలో రూ. 25 వేల లోపు రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా అది కూడా ముందుకు సాగడం లేదు. రూ. 25 వేల లోపు రుణాలకు సంబంధించి 5.8 లక్షల మంది రైతులు ఉన్నట్టు ఆఫీసర్లు లెక్కలు తీశారు. వీరి కోసం రూ. 1,210 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇంతవరకు రైతుల రుణమాఫీ మాత్రం జరగలేదు. రైతుల పూర్తి వివరాలు ఇంకా అందలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. ‘‘ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పటిదాకా మాఫీ చేయలే. రైతులకు వడ్డీమీద పడుతోంది. ఆలస్యం చేసిన కొద్దీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది” అని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

రైతులను డైవర్ట్ చేయడం కోసమేనా?

చెప్పిన పంటను వేయకుంటే రైతు బంధు పైసలు ఇవ్వబోమని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత కొత్త వ్యవసాయ విధానంపై మాత్రమే మాట్లాడారు తప్ప రైతుబంధు సాయం ఇవ్వబోమనే విషయాన్ని చెప్పడం మానేశారు. రైతుల్లో ఏర్పడ్డ నెగెటివ్ ఫీలింగ్ పోగొట్టే ఉద్దేశంతోనే ఆయన ‘తీపి కబురు’ అస్త్రాన్ని ప్రయోగించి ఉండొచ్చన్న అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి.