లక్ష కోట్లు దాటిన స్వీట్స్‌ ,స్నాక్స్ బిజినెస్

లక్ష కోట్లు దాటిన స్వీట్స్‌ ,స్నాక్స్ బిజినెస్

ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లకు
రూల్స్‌‌ ఫుడ్‌ ఇండస్ట్రీకే మంచిది: ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ సీఈఓ

హైదరాబాద్‌‌, వెలుగు: స్వీట్స్‌‌ , శ్నాక్స్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఏటా రూ. లక్ష కోట్ల టర్నోవర్‌ను సాధిస్తోందని, ఇది వచ్చే ఐదేళ్లలో రూ. రెండు లక్షల కోట్లకు చేరుకోవాలని కోరుకుంటున్నానని పుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఏఐ) సీఈఓ పవన్‌ కుమార్‌ అగర్వాల్‌ అన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌‌లో గురువారం ప్రారంభమైన వరల్డ్‌ మిఠాయి, నమ్‌ కీన్‌ మూడవ కన్వెన్షన్‌, ఎక్స్‌‌పోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఇండస్ట్రీలోని మొదటి తరం ఎంటర్‌ ప్రెన్యూర్‌లు ఇండస్ట్రీని ప్రస్తుతం ఉన్న స్టేజికి తీసుకొచ్చారని తెలిపారు. ఇండస్ట్రీ గ్రోత్‌ 2.0 కి ప్రస్తుత ఎంటర్‌ ప్రెన్యూర్‌లు కృషి చేయాలన్నారు. అందుకోసం పది పాయింట్ల ప్లాన్‌ను పాటించాలని సలహాయిచ్చారు. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఫుడ్‌ వేస్టేజిని తగ్గించాలని, మురుగు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒబెసిటీ, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌‌ పెరుగుతున్నాయని, ప్రజల ఆరోగ్యానికి కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్వీట్స్‌‌,శ్నాక్స్‌‌ తయారిలో ఉప్పు, తీపి వాడకాన్ని తగ్గించుకోవాలని సలహాయిచ్చారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఏఐ నియంత్రణలు ఉండడం కంపెనీలకు మంచిదేనన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్లతో కస్టమర్లను ఆకర్షించగలవు కానీ చిన్న కంపెనీలను ప్రజలు నమ్మడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఏఐ గుర్తింపు సాయపడుతుందన్నారు.

రెండు రోజులు జరగనున్న ఈ కన్వెన్షన్‌‌లో హల్దీరామ్‌ ఫౌండర్‌ శివకిషన్‌ అగర్వాల్‌, ఈడీ ఏకే త్యాగీ, డైరక్టర్‌ మనోహర్‌ లాల్‌ అగర్వాల్‌, బికనీర్‌ వాలా ఎండీ శ్యామ్‌ సుందర్‌ అగర్వాల్‌ , ఆల్మండ్‌ హౌస్‌ డైరక్టర్‌ చైతన్య ముప్పాల అతిథులుగా పాల్గొ న్నారు. హల్దీరామ్‌ ఈడీ మాట్లాడుతూ.. కస్టమర్లకు అందించే టేస్ట్‌లో మార్పు లేకుండా, కంపెనీ ఉత్పత్తుల్లో ఉప్పు, తీపి వాడకాన్ని తగ్గిస్తామని అన్నారు. వివిధ రకాల జీఎస్‌టీ స్లాబ్స్‌‌, ఫుడ్‌ సేఫ్టీ నిబంధనల వలన ఇండస్ట్రీ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, ఇవి లేకపోతే ఇండస్ట్రీ మరింత వృద్ధి చెందుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ స్వీట్స్‌‌, నమ్‌ కీన్ మాన్యు ఫ్యాక్చరర్స్‌‌ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎం) ఎండీ ఫిరోజ్‌ హెచ్‌ నఖ్వీ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆల్మండ్‌ హౌస్‌ , ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో స్వీట్స్‌‌, శ్నాక్స్‌‌ ఇండస్ట్రీకి చెందిన ఎంటర్‌ ప్రెన్యూర్ పాల్గొన్నారు. హల్దీరామ్‌ ఫౌండర్‌ శివకిషన్‌ అగర్వాల్‌కు లైఫ్‌ టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డును ఈ కన్వెన్షన్‌లో అందజేశారు. మొదటి రోజు కన్వెన్షన్‌లో టాప్‌ 100 ఎంటర్‌ ప్రెన్యూర్‌లకు అవార్డులను ఇవ్వనున్నారు. స్వీట్స్‌‌, శ్నాక్స్‌‌ ఇండస్ట్రీలో తాము చేసిన ఇన్నొవేషన్స్‌‌కు, ఎక్సలెన్స్‌‌కు ఈ అవార్డును అందుకోనున్నారు.

హైదరాబాద్‌‌లో బికనీర్‌ వాలా ప్లాంట్‌ స్వీట్స్‌‌, స్నాక్స్‌‌ ఇండస్ట్రీకి హైదరాబాద్‌ పెద్ద మార్కెట్ అని బికనీర్‌ వాలా ఎండీ శ్యామ్‌ సుందర్‌ అగర్వాల్‌ అన్నారు. హైదరాబాద్‌లో ప్లాంట్‌ పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఇప్పటికే సిటీలో ఐదు ఔట్‌ లెట్లను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది కాలంలో రూ .
100 కోట్లు పెట్టుబడితో ప్లాంట్‌ పెడతామని తెలిపారు.

ఫేక్‌ సైట్లకు దూరంగా ఉండండి
ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఏఐ పేరుతో కొన్ని ఫేక్ సైట్లు నడుస్తు న్నాయని వీటికి ఫుడ్‌ ఆపరేటర్స్(ఎఫ్‌బీఓ) దూరంగా ఉండాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఏఐ సీఈఓ పవన్‌ కుమార్‌ అగర్వాల్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్‌, లైసెన్సింగ్‌ సర్వీసులను అందిస్తామని ఫేక్‌‌ సైట్లు నడుస్తున్నాయని, ఎఫ్‌బీఓలు డబ్బులను పోగుట్టుకుంటే తమకు సంబంధం లేదని అన్నారు. ఎఫ్‌బీఓలు లైసెన్స్‌‌ లేదా రిజిస్ట్రేషన్ల కోసం కేవలం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ సైట్‌ ద్వారానే అప్లై చేసుకోవడానికి వీలుంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఏఐ ఫుడ్‌ సేఫ్టీ మిత్రా స్కీమ్‌ను లాంచ్ చేసింది. దీనిలో భాగంగా డిజిటల్ రిజిస్ట్రేషన్‌, లైసెన్సిం గ్‌ ఫైలింగ్‌లో ఎఫ్‌బీఓలకు సాయం చేయడానికి డిజిటల్‌ మిత్రాలకు ట్రెయినింగ్‌ ఇస్తారు.