
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంప్ ఇగా స్వైటెక్ నాలుగో రౌండ్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ స్వైటెక్ (పోలాండ్ ) 6–-4, 6–-2తో మరియా బజ్కోవా(చెక్ రిపబ్లిక్)పై వరుస సెట్లలో నెగ్గింది. మూడో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 6–2, 6–4తో డయానా (ఉక్రెయిన్)ను, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్) 6–1, 6–3తో పకెట్ (ఫ్రాన్స్)ను ఓడించగా, ఎనిమిదో సీడ్ జాబెర్ (ట్యునీషియా) 6–4, 7–6 (7/5)తో 31వ సీడ్ లెలా అనీ (ఫ్రాన్స్)పై గెలిచింది.
మెన్స్ సింగిల్స్‌లో ఆరో సీడ్ రష్యా స్టార్ రబ్లెవ్ మూడో రౌండ్‌లో 6-–7 (8/6), 2–6, 4–6తో వరుస సెట్లలో అర్నాల్డీ (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. రెండో సీడ్ సినర్ (ఇటలీ) 6–4, 6–4, 6–4తో పావెల్ కొటోవ్ (రష్యా)పై నెగ్గాడు. కాగా, మెన్స్ డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (ఇండియా)– మిగ్వేల్ (మెక్సికో) తొలి రౌండ్‌లో 6–3, 6–4తో రీస్ స్లాల్డర్ (అమెరికా)–వెర్వెక్ (నెదర్లాండ్స్)పై నెగ్గారు. యూకీ భాంబ్రీ (ఇండియా)–ఒలీవెటి (ఫ్రాన్స్) పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది.