టీకా ప్రచారం కోసం సిరంజ్​ల ఆటో

టీకా ప్రచారం కోసం సిరంజ్​ల ఆటో

అతను అందంగా బొమ్మలేస్తాడు. ఆ బొమ్మలతో చైతన్యం కూడా తెస్తాడు. రీసెంట్​గా సిరంజి బొమ్మలున్న ఆటోతో కరోనా వ్యాక్సినేషన్​పై ప్రచారం 
చేస్తున్న అతని పేరు గౌతమ్​.  

కరోనా కట్టడికి వ్యాక్సిన్​ వేసుకోవడం ఎంత ముఖ్యమో చెప్పాలనుకున్నాడు ​ చెన్నైకి చెందిన గౌతమ్​. అతడి ఆలోచనకు  చెన్నై మున్సిపల్​ కార్పొరేషన్​ చెయ్యి అందించింది. అప్పటికే, అతడు తన టీం​తో కలిసి కరోనా వైరస్ ఆకారంలో ఒక​ ఆటో డిజైన్​ చేశాడు. ఇప్పుడు ఆటోను కరోనా వ్యాక్సినేషన్​ అవేర్​నెస్​ వెహికల్​గా మార్చాడు. ఆటోకు లేత నీలం రంగు వేసి, ఆటో ముందూ, వెనకాల  ఇంజెక్షన్​ సిరంజ్​, ఆటో మీద వ్యాక్సిన్​ బాటిల్​ బొమ్మ డిజైన్​ చేశాడు. అందుకోసం ​వేస్ట్​ పైపులు, పాత ప్లాస్టిక్​ బాటిళ్లు, మరికొన్ని పనికిరాని వస్తువుల్ని వాడాడు. ఆటోకు ఉన్న మైక్​ ద్వారా వ్యాక్సిన్​, కరోనా జాగ్రత్తల గురించి చెబుతున్నాడు. ‘‘చాలామంది వ్యాక్సిన్​ వేసుకునేందుకు భయపడుతున్నారు. ఈ స్పెషల్​ఆటోతో వ్యాక్సిన్​ ఇంపార్టెన్స్​ని​,  ప్రచారం చేస్తున్నా” అంటున్నాడు గౌతమ్​. ఈ ఒక్కటే కాదు సమాజంలో అవేర్​నెస్​ తేవాలనుకున్న ప్రతిసారి తన ఆర్టిస్టిక్​ స్కిల్స్ ఉపయోగించాడు.  కరోనా కేసులు పెరుగుతున్న టైంలో ‘కొవిడ్​ హెల్మెట్​’, ‘కొవిడ్​ వెపన్స్’ వంటి క్యాంపెయిన్స్ చేశాడు ఈ ఆర్టిస్ట్. 

ఇంజనీరింగ్​ టు ఆర్టిస్ట్​
మెకానికల్​  ఇంజనీరింగ్​ చదివిన గౌతమ్​ ఆర్ట్ మీద ప్యాషన్​తో దాన్నే కెరీర్​గా ఎంచుకున్నాడు.  ‘ఆర్ట్​ నీకు అన్నం పెట్టదు’ అని అతడి నిర్ణయాన్ని కొందరు తప్పు పట్టినా, గౌతమ్​కు తన మీద తనకు నమ్మకం ఉంది. మొదట్లో వాల్​ఆర్ట్, రెసిడెన్షియల్ ఆర్ట్ వేసేవాడు. సొంతంగా ‘ఆర్ట్​ కింగ్​డమ్​’ స్టార్ట్​ చేశాడు. 
ప్రొఫెషనల్​ ఆర్టిస్ట్​గా రాణిస్తూనే, సందర్భం వచ్చిన ప్రతిసారి తన ఆర్ట్​ వర్క్​తో జనంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్లాస్టిక్​ వేస్ట్ మీద అవేర్​నెస్​ తేవడం కోసం 2019లో ‘వాక్​ ఫర్​ ప్లాస్టిక్​’ క్యాంపెయిన్​ స్టార్ట్​ ​ చేశాడు. 

కరోనా హెల్మెట్​
కరోనా మొదటి వేవ్​ అందర్నీ ఇళ్లకే పరిమితం చేసింది. ఆ టైంలో  లాక్​డౌన్​ డ్యూటీ చేస్తున్న పోలీసులతో కలిసి ప్రజల్లో కరోనా వైరస్​పై అవగాహన పెంచాలనుకున్నాడు గౌతమ్. 
పాత హెల్మెట్​ను ‘కరోనా హెల్మె​ట్​’గా డిజైన్​ చేసి పోలీసులతో కలిసి అవేర్​నెస్​ డ్రైవ్​ చేశాడు. ఆ తర్వాత కరోనా వైరస్​ను పోలిన ఆటో, రోబో తీసుకొచ్చాడు. 
ఇవేకాకుండా ‘హ్యాంగ్​ ది రేపిస్ట్’, ‘నో మోర్​ స్ట్రా’, ‘నో జిఎస్టీ ఫర్​ శానిటరీ ప్యాడ్స్​’ వంటి ఆర్ట్​ వర్క్స్​తో అందర్ని ఆలోచింపజేశాడు గౌతమ్​.  

అవేర్​నెస్​ కోసం...
‘‘నాకు ఆర్ట్ అంటే​ ఎంత ఇష్టమో, చెన్నై అంటే కూడా అంతే ఇష్టం. ప్రజలు బీచ్​లో చెత్త పడేయడం చూసి ఊరికే ఉండలేకపోయా. ప్లాస్టిక్​ వేస్ట్ సముద్ర జీవులకు ఎంత హాని చేస్తుందో నా స్టైల్​లో చెప్పాలనుకున్నా. బీచ్​లో కలెక్ట్​ చేసిన ప్లాస్టిక్​ బాటిళ్ల మూతలతో 23 అడుగుల తిమింగలం బొమ్మ (కిల్లర్​ వేల్) తయారు చేసి చెన్నైలోని బీచుల్లో ప్రదర్శనకు పెట్టి, పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో వివరించా. ప్రజల్లో అవేర్​నెస్​ తేవాలి అనుకున్న ప్రతిసారి నా క్రియేటివిటీని ఉపయోగించేవాడిని” అని చెప్తాడు గౌతమ్​.