యువతకు మార్గదర్శిగా మహేశ్కుమార్ గౌడ్

యువతకు మార్గదర్శిగా మహేశ్కుమార్ గౌడ్

‘నాయకుడు అంటే  ప్రజల బాగుకోసం ఆలోచించాలి.  తనకు వచ్చిన అవకాశాలను, బాధ్యతలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగితే సమాజం బాగుపడుతుంది’ అని నేను చదువుకునే రోజుల్లో మా గురువు  చెప్పేవారు. 135 ఏండ్లకు పైగా  ఘన చరిత్ర గల కాంగ్రెస్‌‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా గురువు మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. చారిత్రాత్మకమైన కాంగ్రెస్‌‌ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ఉంటేనే చాలామంది ఎంతో గర్వపడుతుంటారు. అలాంటి పార్టీలో మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌  టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలంలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.  ఒక సాధారణ కార్యకర్తకు ఉన్నత పదవులు లభించడం కాంగ్రెస్‌‌లోనే సాధ్యమని చెప్పడానికి మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌ నియామకమే ప్రత్యక్ష నిదర్శనం.  ఆయనపై విశ్వాసంతో కాంగ్రెస్‌‌ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను ఆయన కూడా ఎంతో నమ్మకంగా నిర్వహిస్తున్నారు. 

విజయవంతంగా బాధ్యతలు

సోనియా గాంధీ, మల్లికార్జున్‌‌ ఖర్గే,  రాహుల్‌‌ గాంధీ, ప్రియాంక గాంధీ మార్గదర్శకత్వంలో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్‌‌, రాష్ట్ర పార్టీ ఇన్​చార్జ్​గా  పనిచేసిన దీపాదాస్‌‌ మున్షీ,  ప్రస్తుత ఇన్​చార్జ్​ మీనాక్షీ నటరాజన్‌‌ తోడ్పాటుతో,  సీఎం రేవంత్‌‌ రెడ్డి,  డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర రాష్ట్ర మంత్రులందరి మద్దతుతో ఆయన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.   రాజకీయ జీవితంలో కీలక పదవులు రావడం ఒక ఎత్తయితే, వాటిని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. అందుకు మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌ నేటి యువతకు స్ఫూర్తిగా, మార్గదర్శిగా  నిలిచారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది.  పదేళ్ల బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్‌‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఎంతో శ్రమించారు. ఈ యజ్ఞంలో భాగంగా మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌ కృషిని గుర్తించిన పార్టీ అధిష్టానం 2024 సెప్టెంబర్‌‌ 6వ తేదీన బీసీ బిడ్డ అయిన ఆయనను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌‌ పార్టీ అధ్యక్షుడిగా  ప్రకటించడం కష్ట పడితే ఫలితం వస్తుందని చెప్పే ‘కష్టే ఫలే’ సూక్తికి నిదర్శనం.

ప్రజా పాలనపై  ప్రజల్లో విశ్వాసం

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం కత్తిమీద సామే అని ఆయనకు బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే అనుభవపూర్వకంగా తెలిసింది.  ఎంతో  సమ్మకంతో అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు, కార్యకర్తలు పార్టీపై చాలా ఆశలు పెట్టుకోవడం సహజమే. వారి ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేసేందుకు రెట్టింపు బాధ్యత పార్టీపై ఉంటుంది. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను ప్రజలకు చేరవేయడంలో పార్టీ శ్రేణులది కీలక బాధ్యత. అందుకు వారిని ప్రోత్సహిస్తూ,  ఉత్సాహపర్చాల్సిన కీలక బాధ్యత పీసీసీదే అని గుర్తించి అందుకు ఆయన చర్యలు తీసుకోవడంతో కాంగ్రెస్‌‌ ‘ప్రజా పాలన’పై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.  ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌‌ పార్టీకే సాధ్యమని నిరూపిస్తూ తెలంగాణలో రేవంత్‌‌ రెడ్డి ప్రభుత్వం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది.  

ఇందిరమ్మ రాజ్యం

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ‘ఇందిరమ్మ రాజ్యం’ అందించడంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోగా వీటిపై టీపీసీసీ చీఫ్‌‌ పిలుపు ఇవ్వగానే కాంగ్రెస్‌‌ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా  క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించారు. మహిళా సాధికారతలో భాగంగా తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని ప్రారంభించగా కాంగ్రెస్‌‌ శ్రేణులు మహిళలను ఇందులో సభ్యులుగా చేర్చేందుకు కృషి చేశారు.  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో కాంగ్రెస్‌‌ కార్యకర్తలను ప్రోత్సహించడంలో టీపీసీసీ చీఫ్‌‌ పాత్ర వెలకట్టలేనిది. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన కులగణనలో ఒక బీసీ బిడ్డగా, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌‌ కుమార్‌‌ భాగస్వాములయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో మహేశ్‌‌ కుమార్‌‌ టీపీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ హోదాలో ‘బీసీ డిక్లరేషన్‌‌’ ప్రకటించే అవకాశం ఆయనకు దక్కింది. ఇప్పుడు ఆయన టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కులగణన విజయవంతమైంది. ఈ రెండూ ఆయనకు జీవితంలో మర్చేపోలేని ఘటనలుగా మిగిలిపోతాయి.  

- అమరవాజి నాగరాజు,
పీఆర్‌‌వో, టీపీసీసీ అధ్యక్షుడు