నేటి నుంచే టీ20 వరల్డ్‌ కప్‌

నేటి నుంచే టీ20 వరల్డ్‌ కప్‌

ఐపీఎల్‌, బీబీఎల్‌, పీఎస్‌ఎల్‌, సీపీఎల్‌, ది హండ్రెడ్‌, కొత్తగా సౌతాఫ్రికా టీ20, ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20... ఇలా ప్రపంచం నలుమూలలా టీ20 లీగ్‌ల సందడి నడుస్తూనే ఉంది. వీటికి తోడు బైలేటరల్‌ సిరీస్‌లు, ఆసియా కప్‌ (టీ20) అదనం. అయినా సరే ఓ మెగా టోర్నీ వస్తుం దంటే అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. అదే టీ20 వరల్డ్‌ కప్‌. పైన చెప్పిన లీగ్స్‌ అన్నింటికీ ఇది పెద్దన్న. 2007లో మొదలైన  ఈ ప్రపంచ పండుగతోనే అన్ని లీగ్స్‌ పురుడు పోసుకున్నాయి. అందుకే ఎన్ని లీగ్స్‌  జరుగు తున్నా.. వాటిలో ఎన్ని రికార్డులు బద్దలైనా.. వరల్డ్‌ కప్‌.. వరల్డ్‌ కప్పే. దానికుండే స్పెషాలిటీనే వేరు. మాజీ చాంపియన్స్‌ అయిన వెస్టిండీస్‌, శ్రీలంక గ్రూప్​ దశలో చిన్న జట్లతో పోరాడుతున్నాయంటేనే ఈ టోర్నీలోపోటీ ఏ స్థాయిలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టీ20 ఫార్మాట్‌లోని అసలైన మజాను అందించే ప్రపంచ కప్‌ పండుగ మళ్లీ వచ్చింది.  పదహారు జట్లు బరిలో నిలిచిన మెగా టోర్నీ ఆస్ట్రేలియాలో నేడు షురూ అవుతోంది.

సరిగ్గా పదిహేనేళ్ల కిందట ఎలాంటి అంచనాలే లేకుండా  సౌతాఫ్రికా గడ్డపై మొదలైన టీ20 వరల్డ్‌ కప్‌ ప్రస్థానం అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది. నాడు తొలి ఎడిషన్‌లో ధోనీ నేతృత్వంలోని టీమిండియా కప్పు నెగ్గడం, దాని స్ఫూర్తితో తర్వాతి ఏడాది ఐపీఎల్‌ మొదలవ్వ డం క్రికెట్‌ గతినే మార్చింది. టీ20 ఫార్మాట్‌ రోజు రోజుకూ  పాపులర్‌ అవ్వడమే కాకుండా లీగ్‌ల ద్వారా అన్ని దేశాల బోర్డులు, ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడు మెగా టోర్నీ ఎనిమిదో ఎడిషన్‌తో అభిమానుల ముందుకొస్తోంది. గతేడాది అరబ్‌ గడ్డపై మెగా టోర్నీ మెరుపులను, టీమిండియా చెత్తాటను మరచిపోకముందే ఆస్ట్రేలియాలో కొత్త టోర్నీ ఆదివారం మొదలవుతోంది.  రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న టీమిండియా ఈసారి కప్పు నెగ్గి గత ఎడిషన్‌ చేదు జ్ఞాపకాలు, మొన్నటి ఆసియా కప్‌ ఫెయిల్యూర్‌ నుంచి బయట పడాలని చూస్తోంది. రెండు సార్లు విన్నర్‌, డిఫెండింగ్‌ చాంప్‌ ఆస్ట్రేలియా సొంత గడ్డపై అనుకూలతలు ఉపయోగించుకొని రెండో కప్పుపై గురి పెట్టగా... ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ కూడా మరోసారి చాంపియన్‌ అవ్వాలని కోరుకుంటున్నాయి. ఐసీసీ టోర్నీలో తడబాటు వీడి తొలిసారి కప్పును ముద్దాడాలని సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండుసార్లు విన్నర్‌ వెస్టిండీస్‌ ఈసారి గ్రూప్​ దశ నుంచి పోఓరు ఆరంభిస్తోంది. 2014 విజేత శ్రీలంక వరుసగా రెండోసారి చిన్న జట్లతో కలిసి గ్రూప్​ దశ ఆడుతోంది. అంచనాలే లేకుండా వచ్చి  ఆసియా కప్‌ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న లంక ఈ టోర్నీలోనూ అదే ఫలితాన్ని రిపీట్‌ చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. అదే సమయంలో సూపర్‌12కు వచ్చి సత్తా చాటేందుకు చిన్న జట్లూ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

సేమ్‌ ఫార్మాట్‌ 
గత ఎడిషన్‌ ఫార్మాట్​నే  ఈసారి కొనసాగిస్తున్నారు. ర్యాంకింగ్స్​ ప్రకారం (2021 నవంబర్‌ 12 నాటికి) అఫ్గానిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌, ఇండియా, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా నేరుగా సూపర్‌ 12 బెర్తు దక్కించుకున్నాయి. శ్రీలంక, నెదర్లాండ్స్​, యూఏఈ, నమీడియా (గ్రూప్​–ఎ), వెస్టిండీస్‌, ఐర్లాండ్​, స్కాట్లాండ్, జింబాబ్వే (గ్రూప్​–బి) ఆదివారం  మొదలయ్యే తొలి దశలో పోటీ పడుతాయి.  ప్రతీ గ్రూప్‌ నుంచి రెండేసి  సూపర్ 12 క్వాలిఫై అవుతాయి. వచ్చే శనివారం మొదలయ్యే సూపర్‌ 12లో  జట్లను మళ్లీ రెండు గ్రూప్​లుగా విభజించారు. ప్రతీ జట్టు తన గ్రూప్‌లోని మిగతా ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అలా రెండు గ్రూపుల్లో టాప్‌2లో నిలిచిన  జట్లు సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. నవంబర్‌ 13 ఎంసీజీలో జరిగే మెగా ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.  

  • 4   2007 తొలి  ఎడిషన్‌లో పాల్గొన్న వారిలో రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌ (ఇండియా), షకీబ్‌ హసన్ (బంగ్లాదేశ్‌),  సీన్‌ విలియమ్సన్‌ (జింబాబ్వే) ఈ టోర్నీలో కూడా ఆడుతున్నారు.
  • 1  ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌ను ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 1992, 2015లో వన్డే వరల్డ్‌‌ కప్స్‌‌కు ఆతిథ్యం ఇచ్చింది.