T20 ప్రపంచకప్: బంగ్లాదేశ్ పై శ్రీలంక గెలుపు

T20 ప్రపంచకప్: బంగ్లాదేశ్ పై శ్రీలంక గెలుపు
  • ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
  • బంగ్లాదేశ్ స్కోర్: 20 ఓవర్లలో 171/4
  • శ్రీలంక స్కోర్: 18.5 ఓవర్లలో 172

షార్జా: టీ20 ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. ఆదివారం బంగ్లాదేశ్ తో తలపడిన శ్రీలంక బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 
లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. నసూమ్ వేసిన తొలి ఓవర్లో కుశాల్ ఫెరీరా (1) పెవిలియన్ కు తిరిగొచ్చాడు. మరో ఓపెనర్ నిశాంక (24)  ఫెరీరా స్థానంలో వచ్చిన హసలంకతో కలసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. బంగ్లా బౌలర్లను చితకబాదుతూ హసలంక మ్యాచ్ పై పట్టు బిగించే యత్నం చేశాడు.

చరిత్ హసలంక కేవలం 49 బంతుల్లో 80 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. కొద్దిసేపు బంగ్లాదేశ్ పోరాడినా.. 16 ఓవర్లో రాజపక్సే చెలరేగిపోయాడు. సైఫుద్దీన్ వేసిన ఈ ఓవర్లో రాజపక్సే ఏకంగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టడంతో మ్యాచ్ శ్రీలంక వైపు మలుపు తిరిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ హల్ హసన్, సైఫుద్దీన్ చెరి రెండు వికెట్లు తీయగా.. నసూమ్ ఒక వికెట్ పడగొట్టాడు.