హైదరాబాద్, వెలుగు: టి9 చాలెంజ్ గోల్ఫ్ టోర్నీలో హైదరాబాద్ గోల్ఫర్ యునైటెడ్, బంకర్ బస్టర్స్, చాముండి బౌల్డర్ హిల్స్ టైగర్స్, దాసోస్ బై మహి జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో చాముండి బౌల్డర్ హిల్స్ 4–0తో పార్ టైమర్స్‌ను వైట్‌వాష్ చేసింది.
కెప్టెన్ కె. శశిధర్ రెడ్డి, దినేష్ అల్లా జోడీ బి9 4-బాల్‌లో కీలక విజయం సాధించగా.. బొల్లావరం వికాస్ రెడ్డి, కరంబీర్ సింగ్ పాంధేర్ జోడీ ఎఫ్9 4-బాల్‌లో విజృంభించింది. సింగిల్స్ విభాగాల్లో మహేష్ కాత్రగడ్డ, బొడ్డు ముత్యం రెడ్డి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పాయింట్లు సాధించారు.
ఇతర మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గోల్ఫర్ 3–1తో విసాఫ్ట్ టైటాన్స్‌పై గెలిచింది. కెప్టెన్ రహమత్ అలీ, శ్రీకాంత్ జోడీ బి9 4 బాల్ విభాగంలో రాణించింది. బంకర్ బస్టర్స్ 3–1తో ఫెయిర్‌వే వారియర్స్‌ను ఓడించింది. రాఖీ సిన్హా, ప్రతాప్ సింగ్ రణావత్ జోడీ 5-2తో ఎఫ్9 4-బాల్ మ్యాచ్‌ను కైవసం చేసుకోగా, ఎస్ మురళి సింగిల్స్‌లో విజయాన్ని నడిపించాడు. దాసోస్ బై మహి 3–1తో ఆర్డీ ఐరన్ ఈగిల్స్‌పై నెగ్గింది. కెప్టెన్ కేబీఎన్ రాజు, శ్రేయస్ దివాకర్ జోడీ ఎఫ్9 4-బాల్‌లో గెలవగా.. నేత్రా రెడ్డి ఎఫ్9 సింగిల్స్‌లో ఆకట్టుకున్నాడు.
