
మొదట ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారిన తాప్సీ.. ఆ తర్వాత వరుసగా వంద కోట్ల క్లబ్బులో చేరే సినిమాలు చేసి శభాష్ అనిపించుకుంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో ఆమె నటించిన హసీన్ రుబా, ఆనబెల్ సేతుపతి, రష్మి రాకెట్ చిత్రాలు మూడూ ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. ఆ చిత్రాలు నటిగా ఆమెని మరిన్ని మెట్లు ఎక్కించాయి కానీ కమర్షియల్ గా ఆమె స్థాయి విజయం దక్కలేదు. అందుకే ఈసారి థియేటర్ లోనే పలకరిస్తానంటోంది తాప్సీ. ఆమె నటించిన శభాష్ మిథూ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ఇది. అందుకే ఆమె పుట్టినరోజు నాడే సినిమాని విడుదల చేస్తున్నారు. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్షన్లో వయకామ్ 18 స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మిథాలీ పాత్ర కోసం చాలా కష్టపడింది తాప్సీ. ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మిథాలీతో పాటు మరికొందరి దగ్గర క్రికెట్ నేర్చుకుంది. ప్రాణం పెట్టి నటించిందని, అందుకే సినిమా అద్భుతంగా వచ్చిందని టీమ్ చెబుతోంది. తాప్సీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ పాత్ర పోషించానని, అసలు మిథాలీ లైఫ్ మీద సినిమా తీస్తే చాలదని, సిరీస్ తీయాలని అంటోంది. ఆల్రెడీ రష్మి రాకెట్లో రన్నర్గా నటించి కాంప్లిమెంట్స్ అందుకున్న తాప్సీ.. మిథాలీ పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.