V6 News

కెనడాను దాటేసిన తైవాన్: ప్రపంచంలోనే 6వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా రికార్డ్

కెనడాను దాటేసిన తైవాన్: ప్రపంచంలోనే 6వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా రికార్డ్

కెనడాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 6వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా తైవాన్ అవతరించడం ఆర్థిక ప్రపంచంలో ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ చారిత్రక మార్పు ప్రధానంగా ఏఐ రంగంలో వస్తున్న వృద్ధి, సెమీకండక్టర్ చిప్‌లకు భారీగా పెరిగిన డిమాండ్ వల్ల సాధ్యమైంది.

తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ ఈ ఏడాది ఏకంగా 35% పెరిగి 4.47 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో కెనడా మార్కెట్ విలువ కేవలం 5% పెరిగి 4.44 ట్రిలియన్ డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో దశాబ్దాల కాలంగా పటిష్టంగా ఉన్న కెనడా మార్కెట్‌ను తైవాన్ అధిగమించింది.

టీఎస్‌ఎమ్‌సీ ప్రభంజనం:
తైవాన్ సాధించిన ఈ ఘనతలో చిప్ తయారీ దిగ్గజం తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో (TSMC) పాత్ర వెలకట్టలేనిది. ఈ ఒక్క కంపెనీ విలువనే ప్రస్తుతం 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తైవాన్ మొత్తం మార్కెట్ విలువలో దాదాపు 45 శాతం వాటా ఈ ఒక్క కంపెనీదే కావడం గమనార్హం. ఎన్విడియా, ఆపిల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు అవసరమైన అధునాతన చిప్‌లను సరఫరా చేస్తూ.. TSMC ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో దూసుకుపోతోంది.

టెక్నాలజీ వర్సెస్ వనరులు:
ఈ పరిణామం పెట్టుబడిదారుల ప్రాధాన్యతల్లో వస్తున్న మార్పును సూచిస్తోంది. కెనడా మార్కెట్ ప్రధానంగా క్రూడ్, మైనింగ్ వంటి నేచురల్ రిసోర్సెస్ తో పాటుగా బ్యాంకింగ్ రంగాలపై ఆధారపడి ఉంటుంది. వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు, నెమ్మదించిన ఆర్థిక వృద్ధి వల్ల కెనడా మార్కెట్ స్వల్ప లాభాలకే పరిమితమైంది. దీనికి భిన్నంగా.. తైవాన్ మార్కెట్ పూర్తిగా టెక్నాలజీ, సెమీకండక్టర్ల ఆధారితమైనది. ఏఐ యుగంలో చిప్‌లే "కొత్త క్రూడ్ ఆయిల్"గా మారడంతో తైవాన్ ఇన్వెస్టర్ల స్వర్గధామంగా మారింది.

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో కూడా టెక్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలే ప్రపంచ మార్కెట్లలో ఆధిపత్యం చెలాయిస్తాయని స్పష్టమవుతోంది. అమెరికా, చైనా, జపాన్ వంటి అగ్రదేశాల సరసన తైవాన్ నిలవడం ఆసియా దేశాల ఆర్థిక బలానికి నిదర్శనం అంటున్నారు ఆర్థిక నిపుణులు. సో మెుత్తానికి ఒక కంపెనీ తైవాన్ ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయిలో మార్చేసిందనే విషయాలు దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు.