స్టార్ హోటళ్లలో టీకాలు.. కేంద్రం ఆగ్రహం

స్టార్ హోటళ్లలో టీకాలు.. కేంద్రం ఆగ్రహం

స్టార్ హోటళ్లలో టీకాలు వేయవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్టార్ హోటళ్లతో కలిసి వ్యాక్సినేషన్  ప్యాకేజీ ప్రకటనలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకా వేయడం జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్  కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్  రాష్ట్రాలకు లేఖ రాశారు.

వ్యాక్సిన్ ఏ ప్రదేశాల్లో వేయాలో కూడా కేంద్రం సూచించింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాలు వేయొచ్చని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించే టీకా సెంటర్, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు కంపెనీల పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే వర్క్  ప్లేస్ వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాలు వేయొచ్చని ప్రకటించింది. వయోవృద్ధులు, దివ్యాంగుల గ్రూప్ హౌసింగ్  సొసైటీలు, రెసిడెంట్  వెల్ఫేర్  అసోసియేషన్  కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, పంచాయతీ భవనాలు, స్కూళ్లు, కాలేజీలు, వృద్ధాశ్రమాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేయొచ్చని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో తప్ప మిగతా ఎక్కడా టీకాలు వేయొద్దన్నారు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ మనోహర్. స్టార్  హోటళ్లలో వ్యాక్సిన్  అందించడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి వెంటనే ఆ కార్యక్రమాన్ని ఆపేయాలని ఆదేశించారు.