పిల్లల్ని టూవీలర్‌పై తీసుకెళ్తున్నారా?.. కేంద్రం కొత్త నిబంధనలివే..

పిల్లల్ని టూవీలర్‌పై తీసుకెళ్తున్నారా?.. కేంద్రం కొత్త నిబంధనలివే..

న్యూఢిల్లీ: టూ వీలర్‌ లో వెనుక సీట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకుని వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. నాలుగేళ్లలోపు చిన్నారులను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేసిన కేంద్రం.. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలతో రూపొందించిన ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. వీటిపై సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రజల్ని కోరింది. రూల్స్ ఖరారైన తర్వాత ఏడాది నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. 

లైఫ్ జాకెట్ తప్పనిసరి

మోటారు వాహన చట్టంలో కొత్త నిబంధనలు చేరుస్తూ సెక్షన్ 129ని తీసుకురానున్నట్లు కేంద్ర సర్కార్ పేర్కొంది. నూతన నిబంధనల ప్రకారం.. 4 ఏళ్లలోపు చిన్నారులను టూ వీలర్లపై తీసుకెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్‌ లాంటి వాటిని ధరించాలని కేంద్రం చెప్పింది. ఈ జాకెట్‌కు ఉండే స్ట్రాప్స్‌ను డ్రైవర్ నడుము చుట్టూ బెల్టు మాదిరిగా బిగించాలని తెలిపింది. తక్కువ బరువుతో, సులువుగా సర్దుబాటు చేసుకునేలా, వాటర్‌ప్రూఫ్‌గా ఉండాలని పేర్కొంది. నైలాన్ మెటీరియల్‌తో 30 కిలోల బరువును పట్టి ఉంచేలా బలంగా డిజైన్ చేయాలని తెలిపింది. చిన్నారులకు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టాలని స్పష్టం చేసింది. బైక్‌ మీద పిల్లలతో వెళ్లేటప్పుడు వాహనాలను 40 కి.మీ.లకు మించి వేగంగా వెళ్లొద్దని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనలు 1989లో సవరణలు చేయనున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తల కోసం: 

ఆర్యన్ కేసును వాదించనున్న అడ్వకేట్ రోహిత్గీ గురించి తెలుసా? 

వాళ్లలో ఉన్నది ఇండియా డీఎన్‌ఏ కాదు: అనిల్ విజ్

ర్యాలీలో వేలాది రైతులుంటే.. 23 మందే సాక్షులా?