ఆర్యన్ కేసును వాదించనున్న అడ్వకేట్ రోహిత్గీ గురించి తెలుసా? 

V6 Velugu Posted on Oct 26, 2021

​​​​​ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం ముంబై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. జస్టిస్‌ నితిన్‌ సంబ్రే బెంచ్‌ ముందు ఆర్యన్‌ పిటిషన్‌ విచారణకు రానుంది. ఆర్యన్‌ తరఫున ప్రముఖ లాయర్, మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ వాదించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు వర్చువల్‌గా విచారణలు జరగ్గా.. ఇపుడు న్యాయవాదులు వ్యక్తిగతంగా కోర్టులో హాజరై వాదనలు వినిపించనున్నారు. మీడియా ప్రతినిధులు కూడా కోర్టుకు రానున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఆర్యన్ ఖాన్ కేసులో వాదనలకు ఓ టీమ్‌ పని చేస్తోంది. ఆ టీమ్‌లో సతీష్ మాన్‌షిండే, అమిత్ దేశాయ్ వంటి పెద్ద లాయర్లు కూడా ఉన్నారు. తాజాగా ఈ లిస్టులో ప్రముఖ కేసుల్లో నెగ్గి పేరు తెచ్చుకున్న మాజీ ఏజీ ముకుల్ రోహిత్గీ చేరబోతున్నారు. ఆయన గురించి పలు విషయాలు తెలుసుకుందాం.. 

ఎవరీ ముకుల్ రోహిత్గీ?

ముకుల్ రోహిత్గీ తన తండ్రి బాటలోనే నడిచి న్యాయవాది అయ్యారు. రోహిత్గీ తండ్రి అవాద్ బెహారీ రోహిత్గీ ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా సేవలందించారు. తండ్రిలాగే న్యాయ వ్యవస్థలో పని చేయాలని అనుకున్న ముకుల్ రోహిత్గీ ఆ దిశగా సక్సెస్ అయ్యారు. దేశానికి 14వ అటార్నీ జనరల్‌గా ముకుల్ రోహిత్గీ సేవలందించారు. రోహిత్గీ తర్వాత ఆ బాధ్యతలను కేకే వేణుగోపాల్ స్వీకరించారు. సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్ అయిన 66 ఏళ్ల రోహిత్గీ.. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా పని చేశారు. 2014 నుంచి 2017 వరకు మూడేళ్ల పాటు ఏజీఐగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

ఒక్క కేసుకు రూ. 1.20 కోట్ల ఫీజు

2002లో గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్ల కేసుతోపాటు పలు ఫేమస్ కేసులను ముకుల్ రోహిత్గీ డీల్ చేశారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్‌కు సంబంధించిన కేసులో చరిత్రాత్మకమైన తీర్పును ఇవ్వడంలో ఏఎస్‌జీగా ఉన్న రోహిత్గీ కీలకంగా వ్యవహరించారు. 2018లో సీబీఐ స్పెషల్ జడ్జి బీహెచ్ లోయ మృతి కేసులో వాదించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 1.20 కోట్ల ఫీజు చెల్లించి రోహిత్గీని స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా అపాయింట్ చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. 

అరుణ్ జైట్లీకి ఆప్తుడు

దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ముకుల్ రోహిత్గీని సన్నిహితుడిగా, స్నేహితుడిగా చెబుతుంటారు. లాయర్ కూడా అయిన జైట్లీతో రోహిత్గీకి మంచి అనుబంధం ఉండేది. బయట స్నేహితులైనప్పటికీ కోర్టులో వాదనల సమయంలో ఇద్దరమూ ప్రొఫెషనల్‌గా ఉండే వాళ్లమని రోహిత్గీ అంటారు. ఒక్కోసారి జైట్లీతో వాదనల సమయంలో పరుష పదాలు మాట్లాడుకునే వాళ్లమని.. అయినా బయటకు వచ్చేసరికి మళ్లీ కలసిపోయే వాళ్లమని తమ బంధం గురించి రోహిత్గీ చెబుతుంటారు. 

మరిన్ని వార్తల కోసం: 

వాళ్లలో ఉన్నది ఇండియా డీఎన్‌ఏ కాదు: అనిల్ విజ్

రేప్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

పోర్న్ సైట్‌లో లెక్కల పాఠాలు.. ఏడాదికి రూ. 2 కోట్ల ఆదాయం

Tagged Drugs Case, Shah Rukh Khan, Bombay High Court., aryan khan, Advocate Mukul Rohatgi, Former AG Rohatgi

Latest Videos

Subscribe Now

More News