
మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలు నిర్వహిస్తున్నారు అడిషన్ కలెక్టర్ రాహుల్. రానున్న పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ రిజల్ట్స్ సాధించడం కోసం వారిలో కాన్ఫిడెన్స్, సబ్జెక్ట్‌పై పట్టు పెంచేందుకు ఈ 'ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష' నిర్వహిస్తున్నారు. ఈ టాలెంట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించి, వారికి ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. విద్యకు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకరాలను అందించనున్నారు. జిల్లా నుంచి ఏటా కనీసం పది మందికి ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ లో ఫ్రీ సీట్లు సాధించేలా ప్రోత్సహించనున్నారు.
నైపుణ్యాలను పెంచడానికి...
జిల్లావ్యాప్తంగా 124 గవర్నమెంట్ హైస్కూళ్లు ఉన్నాయి. ఒక్కో స్కూల్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 620 మంది మెరిట్స్టూడెంట్లను ప్రతిభా ప్రోత్సాహక పరీక్షకు సెలెక్ట్ చేశారు. అసెస్మెంట్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా మళ్లీ స్కూల్ లెవల్లో టెస్ట్ నిర్వహించి ఐదుగురిని ఎంపిక చేశారు. జిల్లావ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేటలో నాలుగు సెంటర్లను ఏర్పాటు చేసి ఈ నెల 11న ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష నిర్వహించారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 25 చొప్పున ఆరు సబ్జెక్టుల్లో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. ఇందులో మెరిట్ సాధించిన ఐదు నుంచి పది మంది స్టూడెంట్లకు ఇంటర్ సిలబస్ లోడెడ్ ట్యాబ్‌లు గిఫ్ట్‌గా అందించనున్నారు.
ఫ్రీ సీట్లు పొందేందుకు
అలాగే ఐదు నుంచి పది మంది విద్యార్థులకు ఇంటర్లో ఫ్రీ సీట్లు ఇప్పించడానికి ఆయా మేనేజ్మెంట్లతో చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది కాస్త ఆలస్యం కావడంతో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే స్టూడెంట్లను ఇందుకు ప్రిపేర్ చేయాడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్...
నిరుడు నవంబర్‌లో జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా బాధ్యతలు చేపట్టిన బి.రాహుల్ ఓవైపు స్థానిక సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు స్కూల్ ఎడ్యుకేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గవర్నమెంట్ స్కూళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మెరుగైన విద్యనందిస్తున్న టీచర్లను, చురుకైన స్టూడెంట్లను అభినందిస్తూ వారికి స్వయంగా లెటర్లు రాస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు తడిచెత్త – పొడిచెత్త అంశంపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆయన తన ప్రణాళికలను కలెక్టర్‌తో, విద్యాశాఖ అధికారులతో చర్చించి అమలు చేస్తుండగా, వారు సైతం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. పేద విద్యార్థుల పట్ల ఈ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ చూపుతున్న ప్రేమను పలువురు అభినందిస్తున్నారు.
విద్యార్థులకు దిక్సూచిగా....
గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులను నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. వారిలో సబ్జెక్ట్ నాలెడ్జ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడానికే 'ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష'లు నిర్వహిస్తున్నాం. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్‌లో మంచి రిజల్ట్ సాధించడానికి కూడా దోహదపడుతుంది. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన ఐదు నుంచి పది మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందించడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్లో ఫ్రీ సీట్లు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తాం.
- బి.రాహుల్, అడిషనల్ కలెక్టర్