కాబూల్‌లో ఆగని నిరసనలు.. ఇంటర్నెట్ నిలిపివేత

కాబూల్‌లో ఆగని నిరసనలు.. ఇంటర్నెట్ నిలిపివేత

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో నిరసనలు ఆగడం లేదు. దేశాన్ని తాలిబాన్లు తమ గుప్పెట్లోకి తెచ్చుకుని అరాచక పాలనకు నాంది వేస్తుండడం, ఈ తాలిబాన్‌ను పాకిస్థాన్‌ను కీలు బొమ్మలా నడిపిస్తుండడంపై అఫ్గాన్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో తాలిబాన్లు తుపాకులు గురిపెడుతున్నా సరే లెక్క చేయకుండా కాబూల్‌లో జనం రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి నిరసన జ్వాలలు వ్యాపించి, తాలిబాన్లపై తిరగబడే ప్రమాదం లేకపోలేదన్న భయంతో కొత్త ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అణచివేతకు కొత్త దారులు వెతుకుతోంది. ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు, వాటికి సంబంధించిన వార్తలను కవర్ చేసే ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులను ఇప్పటికే నిర్బంధించి, హింసించిన ఘటనలు కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలో మెయిన్ స్ట్రీమ్‌ మీడియాతో పాటు సోషల్ మీడియాను కూడా కట్టడి చేసేందుకు తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాలకు కాబూల్ నిరసనలకు సంబంధించిన సమాచారం పొక్కకుండా ఉండేందుకు అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేయాలని తాలిబాన్ ఇంటెలిజెన్స్ ఆదేశాలిచ్చింది. మరోవైపు ఎవరైనా సరే నిరసనలు తెలపాలంటే తాలిబాన్ న్యాయ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలని  హోం మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) గైడ్ లైన్స్ జారీ చేసింది.

రోడ్లపైకి మహిళలు

ఈ వారంలో గడిచిన కొద్ది రోజులుగా తాబిబాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో మహిళలు సైతం భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. పంజ్‌షీర్‌‌లో తాలిబాన్లు దాడులు చేసి నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్‌లో కీలక నేతలను చంపేశారన్న వార్తలు వచ్చిన రోజున భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్డెక్కి ‘‘లాంగ్ లివ్ రెసిస్టెన్స్” అంటూ నినాదాలు చేశారు. ఈ దాడుల్లో తాలిబాన్లు పైచేయి సాధించడానికి కారణం వాళ్లకు పాకిస్థాన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ సాయం చేయడమేనని తెలియడంతో ఆ దేశపు జోక్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెత్ ఆఫ్ పాకిస్థాన్‌ అని నినాదాలు చేస్తూ మహిళలు కాబూల్‌లోని పాకిస్థాన్ ఎంబసీ ఎదుట నిరసనలు చేశారు. రెండ్రోజుల క్రితం (మంగళవారం) ముల్లా హసన్ ప్రధానిగా తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసిన నేపథ్యంలో మళ్లీ 20 ఏండ్ల తర్వాత మరోసారి అరాచక పాలన చూడాల్సి వస్తోందన్న భయంతో ఈ ప్రభుత్వాన్ని అఫ్గాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. షరియా చట్టం పేరుతో మహిళల హక్కులను కాలరాస్తారన్న ఆందోళన వారిలో నెలకొంది. మరోవైపు తాలిబాన్లు పాకిస్థాన్, ఐఎస్ఐ చేతిలో తోలుబొమ్మలా ఆడుతోందన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు.