కాబుల్‌లో పాక్‌ వ్యతిరేక నిరసనలు.. తాలిబాన్ల ఫైరింగ్

కాబుల్‌లో పాక్‌ వ్యతిరేక నిరసనలు.. తాలిబాన్ల ఫైరింగ్

కాబూల్: తాలిబన్ల నిరంకుశ వైఖరితో విసిగిపోతున్న ఆఫ్ఘన్లు ముఖ్యంగా మహిళలు తమ నిరసనలను తెలియజేసేందుకు రోడ్డెక్కుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆనూహ్యంగా కాబూల్‌ నగరంలో భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ముఖ్యంగా కాబూల్‌లో తాలిబన్ల పెత్తనం మొదలయ్యాక జనం ఈ స్థాయిలో వీధుల్లోకి రావడం ఇదే మొదటిసారి. ఆఫ్ఘన్ల నిరసన ప్రదర్శనల్లో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాను తాలిబన్లు పూర్తిగా నియంత్రిస్తుండడంతో ఎక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో  జనం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. తాలిబన్ల తీరుతో విసిగిపోయిన మహిళలు ధైర్యం చేసి గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించి వాటి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అంతర్జాతీయ సమాజానికి షేర్ చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయంగా సహాయ సహకారాలు అందకపోయినా నిరాశకు గురికాకుండా పక్క వీధిలోని జనం ప్రదర్శనలు మొదలుపెట్టడంతో ఒకరికొకరుగా మరింత ఉత్సాహంగా తాలిబన్లకు వ్యతిరేకంగా ధైర్యంగా పెదవి విప్పుతున్నారు. ఒక వీధిలోని జనాన్ని చూసి పక్క వీధి వారు మేము సైతం అంటూ బయటకు వచ్చి ప్రదర్శనలు చేపడుతున్నారు. దీంతో కాబుల్ నగరం అంతటా నిరసన ప్రదర్శనలు సంఖ్య పెరుగుతోంది. వేల సంఖ్యలో జనం ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.


పాక్ వ్యతిరేక నినాదాల హోరు

కాబూల్ లో పాక్ వ్యతిరేక నినాదాలు మిన్నంటుతున్నాయి. కొన్ని వీధుల్లో మహిళలు ప్రత్యేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పాకిస్తాన్ చేతిలో కీలు బొమ్మలా వ్యవహరించే ప్రభుత్వం తమకు వొద్దని, ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 'ఆజాది... ఆజాది' అంటూ మహిళల నినాదాలు కాబుల్ నగరంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

ర్యాలీలను చెదరగొట్టేందుకు గాలిలోకి కాల్పులు

ఆఫ్ఘన్ రాజధాని కాబుల్ లో పాకిస్తాన్ వ్యతిరేక ర్యాలీ కోసం తరలివచ్చిన జనాన్ని చెదరగొట్టడానికి తాలిబాన్లు మంగళవారం గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా జనం బెదరకుండా నినాదాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. గత నెలలో తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత జనం ముఖ్యంగా మహిళలు ధైర్యంగా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేయడం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబాన్లు ఇంకా కొత్త  ప్రభుత్వాన్ని ప్రకటించలేదు, కానీ 1996 మరియు 2001 మధ్య కాలం నాటి తాలిబన్ల క్రూరమైన పాలన పునరావృతమవుతుందనే భయంతో-రాజధాని కాబూల్ లో మొదలైన ప్రదర్శనలు హెరాత్ మరియు మజార్-ఐ-షరీఫ్‌తో సహా చిన్న పట్టణాలకు విస్తరించినట్లు సమాచారం.

పాక్ రాయబారి కార్యాలయం ఎదుట నిరసన

ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ జోక్యం చేసుకుని.. తాలిబన్లపై పెత్తనం చెలాయించే దిశగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ మంగళవారం కనీసం 70 మందికిపైగా మహిళలు పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని పాక్ జోక్యం వద్దంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఫైజ్ హమీద్ స్వయంగా కాబూల్‌కు వచ్చి తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం చేసుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. పాక్ చేతిలో కీలుబొమ్మ ప్రభుత్వం తమకొద్దని వారు నినాదాలు చేస్తున్నారు. నిరసన ప్రదర్శనలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లను తాలిబన్లు అరెస్టు చేసినట్లు సమాచారం.