అఫ్గాన్ లో తాలిబాన్ల సాంస్కృతిక విధ్వంసం

అఫ్గాన్ లో తాలిబాన్ల సాంస్కృతిక విధ్వంసం

ఏ దేశానికైనా చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలే అస్తిత్వం. వాటిని నిరంతరం కాపాడుకుంటూ భవిష్యత్​ తరాలకు అందించాలని ప్రతి దేశం ప్రయత్నిస్తుంటుంది. కొన్ని దేశాలు మాత్రం అందుకు విరుద్ధం. అరాచకమే అస్తిత్వంగా ముందుకు సాగుతుంటాయి. అలాంటి దేశాల్లో ఇరాక్, సిరియాలతోపాటు అఫ్గానిస్తాన్ కూడా ఉంది. అఫ్గాన్ ​అంటే గన్నులు, బుల్లెట్లు, కాల్పులే కనిపిస్తాయి.. కానీ ఆ దేశానికి ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఉంది. అఖండ భారతంలో అఫ్గాన్​ గాంధార రాజ్యంగా హైందవ ధర్మాన్ని కొనసాగించింది. యునెస్కో ఇక్కడ రెండు చారిత్రక కట్టడాలను గుర్తించింది. వారసత్వ సంపదను ధ్వంసం చేసే చరిత్ర గల తాలిబాన్లు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ అఫ్గాన్​ను గుప్పెట్లోకి తీసుకోవడంతో సాంస్కృతిక సంపద రక్షణతో పాటు సాధారణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపైనా భయాందోళన నెలకొంది. 

మహాభారత సమయం నుంచి మన దేశానికి అఫ్గాన్లతో సత్సంబంధాలున్నాయి. దృతరాష్ట్రుని సతీమణి గాంధారి ఎవరో కాదు గాంధార దేశపు యువరాణి. అఫ్గానిస్తాన్ లోని బమియాన్ బౌద్ధ విగ్రహాలకు ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు ఉంది. ఆరో శతాబ్దంనాటి (కుషాణుల కాలం నాటివిగా భావిస్తున్న) దాదాపు 1500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహాలను ఇసుకరాతి కొండలపై గాంధార శిల్పకళకు ప్రతిరూపంగా అందంగా చెక్కారు. హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని అందమైన లోయ బమియాన్. ఇక్కడ ఎన్నో బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి. దాదాపు రెండో శతాబ్దంలో గాంధార దేశానికి ముస్లింల దండయాత్రల వరకు ఈ గుహలు బౌద్ధులకు రక్షణ(సేఫ్ హౌజ్)గా నిలిచాయి. 9వ శతాబ్దంలో పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా మారేంతవరకు ఈ ప్రాంతంలో బౌద్ధ, గాంధార సంస్కృతి విలసిల్లింది. ఆ తర్వాత ఇస్లామిక్ పాలకుల నిర్లక్ష్యం, ఉగ్రవాదుల దాడుల వల్ల విగ్రహాలు ఒక్కొక్కటిగా ధ్వంసమవుతూ వచ్చాయి. 2011లో తాలిబాన్లు ప్రపంచంలోనే పెద్దవైన రెండు విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత 2 దశాబ్దాలపాటు ప్రజాస్వామ్యయుత ప్రభుత్వమే అఫ్గానిస్తాన్ లో అధికారంలో ఉన్నప్పటికీ.. ధ్వంసమైన ఈ ప్రపంచ వారసత్వ కట్టడాలను పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టలేదు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో అధికారంలోకి రావడం.. ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక, వారసత్వ అంశాలపై ఆసక్తి కనబరిచేవారితోపాటు.. స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 2001 నుంచి ఇప్పటి వరకు వారు అనుభవిస్తున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తాలిబాన్లు ఒక్కసారిగా లాగేసుకున్నారు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాలిబాన్లు చెబుతున్నా.. మానవహక్కులను కాలరాసి విద్య, న్యాయం వంటి కనీస హక్కులను కూడా కల్పించని మధ్యయుగ కాలంనాటి క్రూరమైన షరియా చట్టాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించడం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 

సాంస్కృతిక వారసత్వం ధ్వంసం

ఇరాక్, సిరియాల్లాగా సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేయడం తాలిబాన్లకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం. 2011లో నాటి తాలిబాన్ చీఫ్ ముల్లా ఓమర్ ఆ దేశంలోని బమియాన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన వారు. మళ్లీ అలా చేయబోమని చెబితే ఎవరైన నమ్మగలరా?. ఒక్కసారి గతంలోకి తొంగిచూస్తే.. 1874 జులై 27న బెల్జియంలో యురోపియన్ దేశాల ప్రతినిధులు సమావేశమై భవిష్యత్తులో తమ దేశాల మధ్య యుద్ధాలు జరిగినా.. ఆయా ప్రాంతాల్లోని చట్టాలను, సంప్రదాయాలను, వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని నిర్ణయించారు. 25 ఏండ్ల తర్వాత అంటే 1899లో నాటి రష్యా చక్రవర్తి, నికోలస్ జార్ 2 అంతర్జాతీయ శాంతి సదస్సుల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ‘ప్రతిదేశానికి తమ చరిత్ర, వారసత్వాన్ని కాపాడుకోవాలని ఉంటుంది. అది వారి హక్కు. యుద్ధాల పేరుతో చరిత్ర, వారసత్వాలకు భంగం కలిగించకూడదు’ అని పేర్కొన్నారు. అప్పటినుంచి దీనిపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. కానీ, దాదాపు 116 ఏండ్ల తర్వాత 2015  ఫిబ్రవరిలో వారసత్వ కట్టడాలను కాపాడాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యునెస్కోలోని దాదాపు 50 దేశాలు తీర్మానం చేశాయి. 2017  మార్చి 24న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తిరిగి ఈ అంశంపై చర్చ జరిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారసత్వ కట్టడాలను రక్షించాలనే తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాక్, సిరియాల నుంచి వచ్చే వారసత్వ, ప్రాచీన కళాఖండాల అమ్మకం, కొనుగోళ్లపై నిషేధం విధించింది. ప్రస్తుత అఫ్గానిస్తాన్‌‌లో యునెస్కో చారిత్రక కట్టడాలుగా గుర్తింపు పొందిన రెండు ప్రాంతాలున్నాయి. ఒకటి అందమైన బమియాన్ లోయ బుద్ధ విగ్రహాలు కాగా, రెండవది ఘోర్ ప్రావిన్సు లోని ఘురిడ్ సామ్రాజ్యపు కాలం నాటి మినారెట్ అండ్ ఆర్కియోలాజికల్ వెస్టిజెస్ ఆఫ్ జామ్. ఒకటవ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఆ ప్రాంతంలో విలసిల్లిన ధర్మాలను ప్రతిబింబించే ఈ పురాతత్వ ప్రాంతాలు గాంధార, బౌద్ధ కళలకు ప్రతిరూపాలుగా నిలిచాయి. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాంతాలను కాపాడాల్సింది పోయి.. 2001 నుంచి విడతల వారీగా వాటిని తాలిబాన్లు ధ్వంసం చేస్తూ వచ్చారు. 

ఇండియాతో ఆత్మీయానుబంధం

చారిత్రక కట్టడాల విధ్వంసంలో ఇస్లామిక్ పాలకులకు ఎవరూ పోటీ లేరు.. రారు కూడా. భారతదేశంలోనూ ఘనమైన, అద్భుతమైన వారసత్వ కట్టడాలు, చారిత్రక విశేషాలు ఇస్లామిక్ పాలకుల చేతిలో నాశనమయ్యాయి. వైభవోపేతమైన దేశ చరిత్రను తుడిచేసేందుకు కూడా ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ భారతదేశం ఐకమత్యంగా ధర్మాన్ని కాపాడుకుంది. అదే ఘనమైన వారసత్వ సంపద.. ఇప్పటికీ దేశం ముందుకు నడిచేందుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇరాక్, సిరియాల్లో ఐసిస్ ఉగ్రవాదులు చారిత్రక ప్రాంతాలను విధ్వంసం చేస్తున్నప్పుడు యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. ఇప్పుడు అఫ్గాన్‌లో తాలిబాన్ల చర్యలనూ ఖండించింది. ఇటీవల నేషనల్ మ్యూజియం ఆఫ్ అఫ్గానిస్తాన్ తాలిబాన్లకు, అంతర్జాతీయ సమాజానికి, భద్రతా బలగాలకు ఓ విజ్ఞప్తి చేసింది. అఫ్గాన్ వారసత్వాన్ని, చరిత్రను ప్రతిబింబించే కట్టడాలన్నింటినీ సంరక్షించుకోవడంలో సహకరించాలని కోరింది. వారసత్వ కళాఖండాలను స్మగ్లింగ్ చేయడాన్ని నిషేధించాలని ఈ దిశగా అందరి సహకారం కావాలని కోరింది. అన్ని వర్గాలు సహకరించాలని.. భారతదేశంతో ఆత్మీయానుబంధం కలిగిన అఫ్గానిస్తాన్‌లో సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, కళలు, వ్యాపారాభివృద్ధి జరగాలని, మహిళలు, చిన్నారులకు వారి హక్కులు లభించాలని ప్రతి భారతీయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు.

అఫ్గాన్​ - భారత సాహిత్య సంబంధాలు

యునెస్కో చారిత్రక కట్టడాలుగా గుర్తింపు పొందిన అఫ్గాన్ ​రెండు ప్రాంతాలపై భారత్, రోమన్, గ్రీక్, ససానియన్ సంస్కృతుల ప్రభావం కనబడుతుంది. సింధూ నాగరికత సమయం నుంచీ భారత్, అఫ్గాన్ దేశాల మధ్య సత్సంబంధాలున్నాయి. అలెగ్జాండర్, ఆ తర్వాత అతని సైన్యాధ్యక్షుడైన సెల్యూకస్ ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. క్రీస్తుపూర్వం 305లో మౌర్య సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంది. రెండో శతాబ్దం చివర్లో ఈ ప్రాంతంలో బౌద్ధ, హిందూ, జొరాస్ట్రియన్ ధర్మాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. తర్వాతి కాలంలోనూ ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగాయి. సాంస్కృతిక, కళా, భాష, సాహిత్య సంబంధాలు నడిచాయి. రెండు దేశాల మధ్య ఫుడ్ ఫెస్టివల్స్ కూడా తరచూ జరిగేవి. ఇవన్నీ రెండు దేశాల మధ్య సంబంధాలను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే వచ్చాయి. రెండు దశాబ్దాలపాటు ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం అఫ్గాన్‌లో ఏర్పడటం, అక్కడి అభివృద్ధిలోనూ భారతదేశం క్రియాశీలక పాత్ర పోషించింది. 2014 తర్వాత, అఫ్గానిస్తాన్ వ్యూహాత్మకంగా కీలకప్రాంతం కావడంతో ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధికి మరింత ఊతమిచ్చింది. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అప్గాన్ పార్లమెంటు భవన నిర్మాణాన్ని మనదేశమే చేపట్టింది. అఫ్గాన్ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో భారతదేశం గణనీయమైన పాత్రను పోషించింది. అమెరికా బలగాలున్నప్పటికీ.. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు భారతదేశం చేయని ప్రయత్నం లేదు. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా వీలున్నప్పుడల్లా అఫ్గాన్ లో శాంతి కోసం యావత్ ప్రపంచం కలసిరావాలని చెబుతూ.. అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.

- ఆర్ధ శ్రీనివాస్​పటేల్, మీడియా &కమ్యూనికేషన్​ ప్రొఫెషనల్​