అఫ్గాన్​ ప్రధానిగా అఖుంద్​..డిప్యూటీగా బరాదర్

అఫ్గాన్​ ప్రధానిగా అఖుంద్​..డిప్యూటీగా బరాదర్

కాబూల్:తాలిబాన్​ లీడర్​షిప్​ కౌన్సిల్ లీడర్​ ముల్లా మొహమ్మద్​ హసన్​ అఖుంద్​ ఆధ్వర్యంలో అఫ్గానిస్తాన్​లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. దేశాన్ని ఆక్రమించిన మూడు వారాల తర్వాత తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వంలో ప్రధానిగా అఖుంద్​ వ్యవహరిస్తారని తాలిబాన్ల ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ చెప్పారు. ఈమేరకు మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్​ కాన్ఫరెన్స్​లో కొత్త ప్రభుత్వ వివరాలను ఆయన ప్రకటించారు. ప్రభుత్వ పెద్దగా హసన్ అఖుంద్​ను తాలిబాన్ల టాప్​ లీడర్​ ముల్లా హెబతుల్లా అఖుంద్​జాదానే ప్రతిపాదించారని సమాచారం. ఈ సందర్భంగా ముజాహిద్​ మాట్లాడుతూ.. ఇప్పుడు ఏర్పాటైంది కేర్​ టేకర్​ ప్రభుత్వమేనని, శాశ్వత ప్రభుత్వం కాదని చెప్పారు. ప్రధానికి డిప్యూటీలుగా అబ్దుల్ ఘనీ బరాదర్, మౌలావీ హనాఫీ వ్యవహరిస్తారని చెప్పారు. ఈమంత్రివర్గంలో అందరికీ ఇద్దరు డిప్యూటీలు ఉంటారని వివరించారు.

యూఎన్​ టెర్రర్​ లిస్టులో..

ఐక్యరాజ్యసమితి టెర్రర్ లిస్టులో ఉన్న తాలిబాన్ల లీడర్ ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్..​ ఇప్పుడు ప్రధాన మంత్రి అయ్యారు. 20 ఏండ్లుగా తాలిబాన్ల లీడర్​షిప్ కౌన్సిల్ ‘రెహ్బరీ షుర’కు అతను నాయకత్వం వహిస్తున్నారు. 2001కి ముందు తాలిబాన్ గవర్నమెంట్​లో మినిస్టర్​గా పని చేశారు.

పాక్​కు వ్యతిరేకంగా కాబూల్​లో నిరసన

పాకిస్తాన్​కు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్ ప్రజలు రోడ్డెక్కారు. పాక్ జెట్ ప్లేన్లు పంజ్ షీర్ ప్రావిన్స్​లో ఎయిర్ స్ట్రైక్స్ చేశాయని వార్తలు రావడంతో రాజధాని కాబూల్​లో మంగళవారం పాక్​కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ‘పాకిస్తాన్​కు చావే’ అని నినాదాలు చేస్తూ మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న వాళ్లలో మహిళలూ ఉన్నారని, అందరినీ చెదరగొట్టేందుకు తాలిబాన్లు గాల్లోకి కాల్పులు జరిపారని, అయినా వాళ్లు భయపడకుండా నిరసన కొనసాగించారని లోకల్​న్యూస్ ఏజెన్సీ ఖమ్మ వెల్లడించింది. తమకు కీలుబొమ్మలా ఉండే ప్రభుత్వం వద్దని, ప్రజలను కలుపుకొనిపోయే సర్కారు కావాలని వాళ్లు డిమాండ్​చేశారంది. తాలిబాన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్ ప్రజలు పోరాడాలని రెసిస్టెన్స్​ ఫోర్స్ లీడర్ అహ్మద్​ మసూద్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నిరసనకారులు రోడ్డెక్కారు. సోమవారం పాక్​కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాలిబాన్లకు పాక్​ సాయం చేస్తోందని గతంలో అఫ్గాన్ సర్కారు చాలాసార్లు ఆరోపించింది.

వీసా, పాస్​పోర్టుంటే పోవచ్చు: తాలిబాన్లు

మజర్ ఏ షరీఫ్ సిటీలో చిక్కుకున్న అఫ్గాన్లు సరైన వీసా, పాస్​పోర్టులుంటే తరలింపు విమానాల్లో వెళ్లిపోవచ్చని తాలిబాన్లు వెల్లడించారు. సిటీ ఎయిర్​పోర్టు దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్లలో చాలా మందికి సరైన వీసాల్లేవన్నారు. ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్న వాళ్లను వెళ్లేందుకు అనుమతిస్తామని తాలిబాన్లు చెప్పినట్టు అమెరికా కూడా వెల్లడించింది. అఫ్గాన్​లో ఉన్న అమెరికన్లు, గ్రీన్ కార్డు హోల్డర్లను తిరిగి అమెరికా తీసుకురావాలని ఆ దేశంపై ఒత్తిడి ఎక్కువుంది. వాళ్ల తరలింపు విషయంలో తాలిబాన్లతో కలిసి పని చేస్తామని అమెరికా ప్రకటించింది.