కేంద్ర కేబినెట్ లో చాన్స్ ఎవరికో.?

కేంద్ర కేబినెట్ లో చాన్స్ ఎవరికో.?

మోడీ కొత్త కేబినెట్​లో ఎవరికి చోటు దక్కనుంది? ఎవరెవరు మంత్రులు కానున్నారు? పలువురు ముఖ్య నేతలకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా మోడీ, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్​లోకి ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై మోడీ, అమిత్​ షా బుధవారం సమావేశమై చర్చించారు. అమిత్​ షా ఇంట్లో సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కొందరు ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలోనే కేబినెట్​ బెర్త్​లకు పలువురి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా నాయకులను గురువారం ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  మంగళవారం కూడా మోడీ, షా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఎన్టీయేలోని భాగస్వామ్య పార్టీలైన శివసేన, జేడీయూకు ఈ సారి కేబినెట్​లో అధిక ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. అప్నాదళ్​కు కూడా మరోసారి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్​, ఒడిశా రాష్ట్రాలకు ఎక్కువ కేబినెట్​ బెర్త్​లు కేటాయిస్తారని సమాచారం. ఆయా రాష్ట్రాల్లో మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. తెలంగాణలోనూ నాలుగు చోట్ల బీజేపీ గెలువడంతో ఇక్కడి నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.

70 మందికిపైగా మంత్రులు?

వాస్తవానికి కేంద్ర కేబినెట్​లో 80 మందికి చాన్స్​ ఉంటుంది. దాదాపు ప్రతిసారి 60 నుంచి 70 లోపే మంత్రులతో కేబినెట్​ కొనసాగుతోంది. అయితే.. ఈసారి మోడీ కేబినెట్​లో 70 మందికిపైగా మంత్రులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగైదు రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. అన్ని రాష్ట్రాలకు ఈ కేబినెట్​లో అవకాశం కల్పించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్​ పరిధి పెరుగనుంది. గురువారం కొందరికి, అటు తర్వాత  విస్తరణలో మరికొందరికి అవకాశం కల్పించనున్నారు. మరోవైపు అంతగా ప్రాధాన్యం లేని కొన్ని శాఖలను విలీనం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. కొత్త మంత్రిత్వ శాఖలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో డ్రింకింగ్​ వాటర్​ మిషన్​ అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే చాన్స్​ ఉంది. గత కేబినెట్​లో ఆయూష్​ అనే కొత్త మంత్రిత్వ శాఖను మోడీ ఏర్పాటు చేశారు. ఈ సారి కేబినెట్​లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు వ్యవసాయ శాఖ మంత్రిగా రాధామోహన్​సింగ్​ కొనసాగారు.

ఆర్థిక మంత్రిగా షా లేదా గోయల్​

తన ఆరోగ్యం బాగోలేదని, కేంద్ర కేబినెట్​లో చేరబోనని మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్​జైట్లీ మోడీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆ మంత్రిత్వ శాఖను ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి బీజేపీ చీఫ్​ అమిత్​ షాను కేబినెట్​లోకి తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల్లో ఏదైనా ఒకటి షాకు దక్కొచ్చని నాలుగురోజులుగా వార్తలు వస్తున్నాయి. హోంమంత్రిగా ఆయనను తీసుకొని మొన్నటివరకు ఆ శాఖను నిర్వర్తించిన రాజ్​నాథ్​ను రక్షణ శాఖకు షిఫ్టు చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. హోంమంత్రిగా రాజ్​నాథ్​నే కొనసాగిస్తూ, ఆర్థిక శాఖను అమిత్​ షాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అమిత్​షా కేబినెట్​లో చేరకుండా బీజేపీ చీఫ్​గానే కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా పీయూష్​ గోయల్​ పేరు సైతం వినిపిస్తోంది. మొన్నటి కేబినెట్​లో జైట్లీ ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇన్​చార్జ్​ ఆర్థిక మంత్రిగా గోయల్​ పనిచేశారు. కొత్త కేబినెట్​లో పలువురు యువ నేతలకు చాన్స్​ దక్కనుంది. ఇందులో గంభీర్ వంటి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పాతవారిలో కొందరికి మళ్లీ చాన్స్​ ఇవ్వనున్నారు. అందులో ముఖ్యంగా మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​గాంధీని ఓడించి విజయం సాధించిన స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహిళలకు అధిక ప్రాధాన్యం

మోడీ ఫస్ట్​ టర్మ్​ కేబినెట్​లో ఎనిమిది తొమ్మిది మంది మహిళలు మంత్రులయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో మహిళలు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో కేబినెట్​లోనూ వారికి ఎక్కువ బెర్త్​లు కేటాయించాలని మోడీ భావిస్తున్నారు. స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, ఉమా భారతి, సుష్మా స్వరాజ్, నజ్మా హెప్తుల్లా, హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్, మేనకా గాంధీ, అనుప్రియా పటేల్​వంటివారు మోడీ ఫస్ట్​ టర్మ్​లో మంత్రులుగా పనిచేశారు. ఆరోగ్యం సహకరించని కారణంగా ఈ సారి సుష్మాస్వరాజ్​ కేబినెట్​లో చేరేలా అవకాశం లేదు.

మిత్రపక్షాలకు ప్రయారిటీ

మహారాష్ట్రలో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన 18 ఎంపీ సీట్లు గెలుచుకుంది. బీహార్​లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 16 సీట్లు సాధించింది. యూపీలో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన అప్నాదళ్​ పోటీ చేసిన రెండు సీట్లలో విజయం సాధించింది. ఈ సారి కేబినెట్​లో శివసేన, జేడీయూకు రెండు మూడు కేబినెట్​ బెర్త్​లు ఖాయమని తెలుస్తోంది. అప్నాదళ్​కు గత కేబినెట్​లో ఇచ్చినట్లే ఈసారి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది.