గ్యాంబ్లింగ్‌ కేసులో నటుడు శ్యామ్‌ అరెస్ట్‌

గ్యాంబ్లింగ్‌ కేసులో నటుడు శ్యామ్‌ అరెస్ట్‌
  • తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన శ్యామ్‌

చెన్నై: ప్రముఖ సినీనటుడు కిక్‌ శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. కోడంబాక్కంలో పోకర్‌ క్లబ్‌ నడుపుతున్న శ్యామ్‌.. గ్యాంబ్లింగ్‌ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగ్‌లు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కిక్‌ శ్యామ్‌ తెలుగు, తమిళ సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్‌, ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్‌-2 చిత్రాల్లో నటించారు. ఎక్కువగా దర్శకుడు సురేందర్‌రెడ్డి సినిమాల్లో కనిపించారు. కిక్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ఆకట్టుకుని టాలీవుడ్‌లో కిక్‌ శ్యామ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్యాంబ్లింగ్‌ కేసులో అతనితో పాటు మరో 11 మందిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. కొన్ని ఆటల్లో గ్యాంబ్లింగ్‌ చేసేందుకు ఉపయోగించే టోకెన్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో మరి కొంత మంది నటులు ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. చాలా మంది సినీ పెద్దలు దీని వెనక ఉన్నట్లు ఒక పోలీసు ఆఫీసర్‌‌ అన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్స్‌ వల్ల డబ్బులు పోగొట్టుకున్న ఒక డిగ్రీ స్టూడెంట్‌, ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంపై విచారణ కొనసాగించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ గేమింగ్స్‌పై నియంత్రణ ఉంచాలని ఇటీవల కోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. శ్యామ్‌ తమిళ్‌తో పాటు చాలా తెలుగు సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌‌గా కూడా నటించారు.