Nikhila Shankar: టాలెంట్ ఉంటే చాలు.. యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి.. నటి నిఖిలా సక్సెస్ స్టోరీ

Nikhila Shankar: టాలెంట్ ఉంటే చాలు.. యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి.. నటి నిఖిలా సక్సెస్ స్టోరీ

నేటి డిజిటల్‌ ప్రపంచంలో సోషల్‌ మీడియా వేదికలు ఎన్నో కొత్తతరం నటీనటులకు అవకాశాల ద్వారాలు తెరుస్తున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని, యూట్యూబ్‌ వీడియోల నుంచి కోలీవుడ్‌ వెండితెర వరకు అడుగులు వేసిన యంగ్ టాలెంటెడ్​ యాక్ట్రెస్​లలో నిఖిలా శంకర్‌ (Nikhila Shankar) పేరు మొదటి వరుసలో ఉంటుంది. గ్లామర్‌ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే తత్వం, సహజమైన అభినయం, పాత్రల ఎంపికలో స్పష్టత... ఇవే ఆమెను కొత్తతరం యాక్ట్రెస్​ల లిస్ట్​లో స్పెషల్​గా నిలబెట్టాయి. చాలామంది ఆర్టిస్ట్​ల కథల్లో చిన్నప్పటి నుంచే డ్రీమ్స్​ ఉంటాయి. కానీ నిఖిల కథ అందుకు డిఫరెంట్​. ఆమె లక్ష్యం సినిమా కాదు. సంగీతం ఆమె ఫస్ట్ లవ్​.

ఇంజినీరింగ్‌ చదువుతున్న రోజుల్లో గాయని కావాలని కలలు కనేది. అయితే జీవితం కొన్ని సందర్భాల్లో మనం ఊహించని మలుపులు తీసుకుంటుంది. నిఖిల జీవితంలో కూడా అలాంటి ఊహించని మలుపే యాక్టింగ్​. స్నేహితుల ప్రోత్సాహంతో సరదాగా కొన్ని ఆడిషన్లలో పాల్గొన్న నిఖిలకు యూట్యూబ్‌ చానెల్‌లో అవకాశం వచ్చింది. ఆ ఒక్క అవకాశం కెమెరా ముందు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. మొదట సరదాగా మొదలైన నటన, క్రమంగా అభిరుచిగా మారింది. అభిరుచి ప్రొఫెషన్​అయింది. ఆ ప్రొఫెషన్​ ఇప్పుడు ఆమెకు గుర్తింపుని తీసుకొచ్చింది.

పది సెకన్ల పాత్ర నుంచి..

సినిమా ప్రపంచంలో ప్రతి అడుగు పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న అవకాశం కూడా జీవితాన్ని మార్చేస్తుంది. నిఖిలకు వెండితెరపై తొలి గుర్తింపు ‘‘మానాడు” సినిమాతో దక్కింది. పాత్ర నిడివి కేవలం కొన్ని క్షణాలే. కానీ ఆ అనుభవం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ తరువాత ‘‘పయణిగల్‌ గవనిక్కవుం’’, ‘‘గట్టా కుస్తీ’’, ‘‘గుడ్‌ నైట్’’, ‘‘లవర్’’ వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక్కో సినిమా ఆమె నటిగా మరింత పరిణతి చెందేందుకు ఉపయోగపడింది. 

అందుకే వదులుకోవాల్సి వచ్చింది!

ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగినకొద్దీ రాజీలు కూడా పెరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నిఖిల తనకంటూ కొన్ని రూల్స్​ పెట్టుకుంది. కథలో భావోద్వేగం ఉండాలి. ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉండాలి. తన పాత్ర బలంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ పాత్రను అంగీకరిస్తుంది. ఈ కారణంగానే కొన్ని అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. అయితే తన నిర్ణయాల పట్ల ఎలాంటి రిగ్రెట్​ లేదని కూడా క్లారిటీ ఇచ్చింది.

బ్రదర్స్ అండ్ సిస్టర్స్..

ప్రేక్షకులు ఒక నటిని గుర్తుపెట్టుకోవడం ఒక విజయమైతే, దర్శకులు ఆ నటిపై నమ్మకం పెంచుకోవడం మరింత పెద్ద విజయం. నిఖిలా శంకర్ ఇప్పుడు ఆ దశలో ఉంది. ఆమె పేరు వినగానే సహజమైన నటన గుర్తుకు వస్తుంది. పాత్రకు న్యాయం చేసే ఆర్టిస్ట్​గా గుర్తింపు పెరుగుతోంది. అందుకే కొత్త ప్రాజెక్టులను ఎంచుకునే విషయంలో ఆమె మరింత జాగ్రత్తగా ఉంటోంది. ప్రతి చిత్రం తన ప్రయాణంలో మరో మెట్టుగా ఉండాలని కోరుకుంటోంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’’ అనే సిరీస్​లో కీ రోల్​ పోషించింది. 

పక్కింటి అమ్మాయి.. 

ప్రేక్షకులు నిఖిలను ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే చూశారు. తెరపై కనిపించే అమాయకత్వం, నేచురల్ ఎక్స్​ప్రెషన్స్​ ఆ ఇమేజ్​ను బలంగా చేశాయి. కానీ నిజ జీవితంలో తాను ‘‘చాలా చురుగ్గా, ఉల్లాసంగా ఉంటానని, తెరపై కనిపించే పాత్రలు తన వ్యక్తిత్వానికి కాస్త భిన్నంగా ఉంటాయ’’ని అంటోంది నిఖిలా శంకర్. అయితే ఆ పాత్రల్లో కనిపించే నిజాయితీ మాత్రం ఆమె వ్యక్తిత్వం నుంచే వస్తుంది. అందుకే ప్రేక్షకులు ఆమెను ఒక పాత్రగా కాకుండా తమకు తెలిసిన వ్యక్తిలా ఫీల్ అవుతారు అంటోంది నిఖిల.

స్నేహంతో మొదలై పెళ్లిదాకా.. 

సోషల్ మీడియా ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నిఖిలా శంకర్ జీవితంలోనూ ఒక అందమైన ప్రేమకథ ఉంది. నిఖిలా శంకర్,  తన భర్త ప్రవీణ్ కెఎస్‌ల పరిచయం మొదట స్నేహంగా మొదలైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆలోచనలను పంచుకోవడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం ఆ స్నేహాన్ని మరింత దగ్గర చేసింది. ఆ అనుబంధమే క్రమంగా ప్రేమగా మారింది. ప్రేమను వ్యక్తం చేసుకోవడం కంటే ముందు ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు తెలుసుకోవడం, పరస్పర గౌరవాన్ని పెంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కెరీర్ పరంగా నిఖిల వేగంగా ఎదుగుతున్న రోజుల్లో కూడా ప్రవీణ్ ఆమెకు అండగా నిలిచారు. కంటెంట్ క్రియేటర్‌గా, నటిగా ఆమె సాధిస్తున్న విజయాల వెనుక కుటుంబం, స్నేహితులతో పాటు ప్రవీణ్ ప్రోత్సాహం కూడా ముఖ్య పాత్ర పోషించింది. 

అదే సమయంలో నిఖిలా కూడా ప్రవీణ్ జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచింది. ఇద్దరి మధ్య పెరిగిన నమ్మకం, అవగాహన, అనురాగం చివరకు వివాహానికి దారితీసింది. కుటుంబ సభ్యుల ఆశీస్సులతో 2024లో వీరిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఒక ఇంటర్వ్యూలో వీళ్ల ప్రేమకథను తెలుసుకున్న చాలామంది ‘రియల్ లైఫ్ తిరుచిత్రంబలం’ అని ధనుష్ నటించిన ‘తిరు’ సినిమా గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే అది కూడా స్నేహం నుంచి పుట్టిన అనుబంధం. ఇప్పటికీ నిఖిల, ప్రవీణ్​లు సోషల్ మీడియాలో అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటోంది. కెరీర్ లక్ష్యాలు, వ్యక్తిగత జీవితం రెండింటినీ బాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ జంట.

డిజిటల్‌ ప్లాట్ ఫాం ఇచ్చిన గుర్తింపు

ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక మంచి వీడియో లక్షల మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తోంది. నిఖిల యూట్యూబ్‌లో చేసిన వెబ్‌ కంటెంట్‌ ద్వారా ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెమెరా ముందు కనిపించే తీరు ఆమెకు ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చింది. యూట్యూబ్‌ ఇప్పటికీ తన జీవితంలో కీలక భాగం. అక్కడే ప్రేక్షకులతో నేరుగా అనుబంధం ఏర్పడింది. అక్కడే దర్శకులు ఆమెను గమనించారు. అక్కడే సినీ అవకాశాలకు పునాది పడింది అని ఓ సందర్భంలో యూట్యూబ్​పై తనకున్న అభిమానాన్ని పంచుకుంది.