కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నిర్మాత కె. రాజన్ మే 17న ఆదివారం నాడు చెన్నైలో ఓ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. కె. రాజన్ చెన్నైలోని అడయార్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
తమిళ చిత్ర పరిశ్రమకు కె. రాజన్ అందించిన సేవలు అనన్యసామాన్యం. కేవలం నిర్మాతగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. 1983లో బ్రహ్మచారిగళ్ చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఆయన వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత డబుల్స్, అవల్ పావం, నినైకోత నాలియై వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 1991లో నిజాల్‌గల్ రవి, శరత్‌కుమార్‌ల కలయికలో వచ్చిన నమ్మ ఊరు మరియమ్మ చిత్రంతో దర్శకుడిగా మారి మెప్పించారు. తంగమన తంగచ్చి, ఉనార్చిగల్’ చిత్రాలకు ఆయనే కథలు అందించారు. నటుడిగానూ మైఖేల్ రాజ్, సొంతక్కరన్, వీట్టోడ మాపిళ్లైతో పాటు.. అజిత్ కుమార్ సూపర్ హిట్ చిత్రం తునివు, సెల్వరాఘవన్ బకాసురన్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించి అలరించారు.
ఆయన వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కుమారుడు ప్రభుకాంత్ సైతం నటుడిగా అరంగేట్రం చేసి... ఆ తర్వాత ఆర్జే బాలాజీ కథానాయకుడిగా వచ్చిన సూపర్ హిట్ పొలిటికల్ శటైర్ చిత్రం ‘ఎల్‌కేజీ’కి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సీనియర్ నటుడు, నిర్మాత ఇలా తనువు చాలించడం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ గాఢ సంతాపతాన్ని ప్రకటిస్తున్నారు.
