
కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై(59) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన పితామగన్ చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించారు. ఇదే సినిమాను తెలుగులో శివపుత్రుడు పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో నటనకు గానూ హీరో విక్రమ్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
మొదట్లో ఎఎం రత్నంతో కలిసి ప్రోడక్షన్ పనులు చూసుకున్న ఆయన ఆ తరువాత ఎవర్ గ్రీన్ ఇంటర్నేషనల్ అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. రజనీకాంత్,విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. గజేంద్ర చిత్రం తర్వాత దురై సినిమాలకు దూరమయ్యారు.
కాగా వీఏ దురైకు విజయలక్ష్మి, లక్ష్మి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు, రెండో భార్యకు ఓ కూతురు ఉంది. దురై మరణం పట్ల కోలీవుడ్ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హీరో సూర్య , విక్రమ్, రజినీకాంత్ అర్థిక సహయాన్ని అందించారు.