మేమొస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా: ఇండియా కూటమి తరఫున స్టాలిన్ హామీ

మేమొస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా: ఇండియా కూటమి తరఫున స్టాలిన్ హామీ
  • కూటమి తరఫున స్టాలిన్ హామీ

పుదుచ్చేరి: లోక్​సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపిస్తే పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈమేరకు పుదుచ్చేరి నుంచి లోక్ సభ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వి వైథిలింగమ్​కు మద్ధతుగా ఆదివారం స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలో స్టాలిన్ మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం పుదుచ్చేరికి చేసిందేమీలేదన్నారు.

ఇక్కడి సీఎం రంగస్వామి కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారారని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇటీవల తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని అన్నారు. పుదుచ్చేరిలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పారు.  

తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల హక్కులను కాపాడే విషయంలోనూ ఇండియా కూటమి ఒకే విధానం పాటిస్తుందని స్టాలిన్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై స్టాలిన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎస్సీ ఎస్టీల సమస్యలను కానీ, బలహీన వర్గాల ఇబ్బందులను కానీ పట్టించుకునేంత తీరిక మోదీకి లేదంటూ ఎద్దేవా చేశారు.