వారంతా వయసైపోయి రాజకీయాల్లోకి వచ్చారు

వారంతా వయసైపోయి రాజకీయాల్లోకి వచ్చారు

కమల్, రజనీకాంత్‌లపై తమిళనాడు సీఎం సంచలన వ్యాఖ్యలు

సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతోనే రాజకీయం వైపు

కమల్, రజనీకాంత్‌లపై ఎడప్పాడి తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి రాజకీయ ప్రత్యర్థులపై మాటలదాడిని పెంచారు. ఇప్పటివరకు ప్రతిపక్షాలపైనే మాటల తూటాలు పేల్చిన ఆయన.. బుధవారం సినీ దిగ్గజాలు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో నటించి డబ్బు సంపాదించిన కమల్‌హాసన్‌.. వయసైపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. అంతేకాదు, ఆయన ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. అలాగే రజనీకాంత్‌ని ఉద్దేశిస్తూ.. ఆయన పార్టీ పెట్టాక చూద్దాంలే అని లైట్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన రాజకీయ వెలితి వుందని రజనీకాంత్‌ వ్యాఖ్యానించడం, ప్రభుత్వంపై కమల్‌హాసన్‌ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో సీఎం పళనిస్వామి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

సీఎం ఎడప్పాడి పళనిస్వామి సేలం జిల్లా ఓమలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాజకీయ వెలితి అని చెప్పినవారు విక్రవాండి, నాంగునేరి ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? కమల్‌ పెద్ద నాయకుడే కదా? లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పొందారు? 65, 66 ఏళ్లు వచ్చేశాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో కావాలనే పథకం ప్రకారం రాజకీయ పార్టీ ప్రారంభించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ ప్రారంభించవచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ, ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. ఇంతకాలం ఆయన ఎక్కడున్నారు? నేను 1974 నుంచి అన్నాడీఎంకేలో ఉంటూ, కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. రాజకీయాల్లో అడుగుపెట్టిన వెంటనే మేము ఈ స్థాయికి చేరుకోలేదు. అటు ఇటుగా 45 ఏళ్లు పార్టీ కోసం శ్రమించాను. ప్రజల కోసం అనేక పోరాటాల్లో పాల్గొని జైలుకి కూడా వెళ్లాము. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసి.. ఇప్పుడు వారి ఆదరణతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మరి వాళ్లు (కమల్‌, రజనీ) ప్రజల కోసం ఏం చేశారు? సినిమాల్లో నటించారు. ఆదాయం సమకూర్చుకున్నారు. ఇప్పటివరకు సంపాదించుకుంటూనే ఉన్నారు కదా. అలాంటి వ్యక్తులు ప్రజల్లో తమకు ఎంతో ఆదరణ ఉందని చెప్పుకుంటున్నారు. నటదిగ్గజం, గౌరవనీయులైన శివాజీ గణేశన్‌ రాజకీయాల్లోకి వచ్చి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. కమల్‌ ఆయన కంటే గొప్ప నటుడేమి కాదు కదా. వయసైపోవడంతోనే కమల్‌హాసన్‌ ముందస్తు సన్నాహాలు చేసుకున్నారు. ఆయన పార్టీకి చెందినవారు ఆయన సినిమాలను చూస్తే సరిపోతుందన్న స్థితికి చేరుకున్నారని భావిస్తున్నాను. అటువంటి స్థితికి చేరుకున్నారు. అయినా ఆయనకు రాజకీయాల గురించి ఏం తెలుసు? స్థానిక సంస్థలు, మున్సిపాలిటి‌లు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఆయా ప్రాంతాల ప్రజల సమస్యల గురించి తెలుసా? ఎటువంటి ప్రాతిపదికలు లేకుండా తనకు తాను పెద్ద నాయకుడిగా చూపించుకుంటున్నారు. సినిమాల్లో నటించి ప్రజల సొమ్మును తీసుకున్నారు. ఆ సంపాదనతో ఇప్పుడు రాజకీయాలు నడుపుతున్నారు’ అని కమల్‌ను సీఎం పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు.

అదే సమయంలో రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం గురించి ప్రశ్నించగా.. ఊహల గురించి సమాధానాలు చెప్పలేమని, ఆయన పార్టీ ప్రారంభించాక చూద్దాంలే అని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లపై సీఎం పళనిస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి