
కోయంబత్తూర్: ద్రవిడ దిగ్గజం, సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం తమిళనాడులోని సుందరపురంలో జరిగింది. దీనిపై ద్రవిడర్ కజగం (డీకే) కార్యకర్తలు కేసు పెట్టారు. ఈ సందర్భంగా పెరియార్ మద్దతుదారులతోపాటు డీఎంకే కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ ఘటనను డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి తీవ్రంగా ఖండించారు. పెరియార్ కేవలం విగ్రహం కాదని సామాజిక న్యాయం దిశగా ఆయనో మార్గం అని కనిమొళి వ్యాఖ్యానించారు. పెరియాక మరణించి దశాబ్దాలు గడిచినా ఆయన ఇప్పటికీ కథనాన్ని నిర్దేశిస్తారు. ఆయన కేవలం ఓ విగ్రహం కాదు.. స్వీయ గౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయపు మార్గం’ అని కనిమొళి ట్వీట్ చేశారు. తరచూ పెరియార్ విగ్రహాలు ధ్వంసమవడంపై తమిళనాడు సర్కార్‌పై ఆమె మండిపడ్డారు. ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు.