కొత్త పార్లమెంటుకు తమిళనాడు 'సెంగోల్'.. అమిత్ షా కీలక ప్రకటన

కొత్త పార్లమెంటుకు తమిళనాడు 'సెంగోల్'.. అమిత్ షా కీలక ప్రకటన

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్రిటీష్ నుంచి భారతీయులకు అధికార మార్పిడికి చిహ్నంగా వచ్చిన స్వాతంత్ర్యానికి సంబంధించిన 'ముఖ్యమైన చారిత్రక' చిహ్నం 'సెంగోల్' (బంగారు దండకం)ని తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. “ఈ సెంగోల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని గురించి ప్రధాని మోడీకి తెలియగానే, దాని గురించి మరింత సమాచారాన్ని పొందాలని కోరారు... ఆగస్టు 14, 1945న 10:45గంటలకు నెహ్రూ తమిళనాడు నుంచి ఈ సెంగోల్‌ను స్వీకరించారు. ఇది అధికార మార్పిడికి ప్రతీక”అని ఆయన అన్నారు. ఈ కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ముందు తమిళనాడు నుంచి ప్రధాని మోడీ సెంగోల్‌ను స్వీకరిస్తారని, ఆయన దానిని కొత్త పార్లమెంట్ భవన్‌లో ఉంచుతారని షా తెలిపారు.

ఇది ఒక పునాది కార్యక్రమం కానుందని, భారతదేశంలో అమృత్ కాల్‌ని గుర్తు చేస్తుందని అమిత్ షా చెప్పారు. మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్రం వచ్చినప్పుడు స్వీకరించిన 'సెంగోల్' కొత్త పార్లమెంటు భవనం లోపల ఉంచబడుతుందని మంత్రి తెలియజేశారు. దీన్ని అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంచామని, త్వరలోనే కొత్త పార్లమెంటు భవనానికి తరలించనున్నట్లు ఆయన ప్రకటించారు. భారతీయ సంస్కృతితో ముఖ్యంగా తమిళ సంస్కృతిలో సెంగోల్‌కు చాలా ప్రాముఖ్యత ఉందని అమిత్ షా పేర్కొన్నారు. "చోళ రాజవంశం కాలం నుంచి ఈ సెంగోల్ కు ప్రాధాన్యత ఉంది... ఈ సెంగోల్ కొత్త పార్లమెంట్‌లో ఉంచబడుతుంది... పీఎం మోడీ ఈ సెంగోల్‌ను స్పీకర్ సీటు దగ్గర ఉంచుతారు" అని ఆయన చెప్పారు.

ఈ సదస్సులో ఈశాన్య ప్రాంత సంస్కృతి, పర్యాటకం, అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.