EWS కోటాపై సుప్రీం తీర్పును తప్పుబట్టిన స్టాలిన్

EWS కోటాపై సుప్రీం తీర్పును తప్పుబట్టిన స్టాలిన్

చెన్నై: EWS కోటాను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. EWS కోటాను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పుబట్టారు. సామాజిక న్యాయానికి  సుప్రీం తీర్పు పెద్ద ఎదురు దెబ్బ అని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. శతాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న సామాజిక న్యాయానికి ఈ తీర్పు గొడ్డలి పెట్టులాంటిదని అన్నారు. సుప్రీం తీర్పుపై న్యాయ కోవిదులు సలహాలు తీసుకుంటామని,  EWS కోటాను రద్దు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. EWS కోటాకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పార్టీలు కలిసి రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. 

కాగా.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో10 శాతం కోటా నిర్ణయాన్ని సమర్థించింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్దమే అని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లపై 3:2తో తీర్పు వెలువరించింది. 10శాతం కోటాను జస్టిస్‌ దినేశ్ మహేశ్వరి, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేబీ పార్దివాలా సమర్థించగా.. సీజేఐ జస్టిస్‌ యు.యు. లలిత్‌, మరో న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర భట్ వ్యతిరేకించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించడం ఇతరుల పట్ల వివక్షచూపడం కాదని, ఈ కోటాతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వచ్చిన నష్టమేమీలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్న రాజ్యాంగ నిబంధనల్ని ఈడబ్ల్యూఎస్ కోటా అతిక్రమించడంలేదని స్పష్టం చేసింది.