రాష్ట్రమంతా బతుకమ్మకు పూల కొరత

రాష్ట్రమంతా బతుకమ్మకు పూల కొరత
  • గుట్టలు, జంగళ్లు తగ్గడం వల్లే ఈ పరిస్థితి
  • కలుపు నివారణ మందుల వాడకమూ కారణమే
  • ఇయ్యాల సద్దుల బతుకమ్మ

వెలుగు: ఒకప్పుడు సద్దుల బతుకమ్మ నాటికి ఏ ఊరి శివారులో చూసినా విరగబూసిన గునుగు, తంగేడు, పట్టుకుచ్చుల పూలతో కళకళలాడేవి. తెల్లారంగనే అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు భుజాలకు సంచులు వేసుకొని చేన్లు, చెల్కలు, గుట్టల వెంట తిరిగి మూటలకొద్దీ పూలు తెచ్చేవాళ్లు. వాటితో మధ్యాహ్నం ఇంటిల్లిపాది పోటీపడి పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బతుకమ్మ పేర్చడంలో ముఖ్యమైన తంగేడు, గునుగు పూలకు కొరత ఏర్పడింది. కాలక్రమేణా గుట్టలు, జంగళ్లు, చెల్కలు తగ్గిపోవడంతో ఆ పూలు కనుమరుగవుతున్నాయి. అదేవిధంగా కూలీల కొరతతో చేన్లలో కలుపు మందులు కొట్టడం వల్ల గునుగు, పట్టుకుచ్చుల, గడ్డి జాతి మొక్కలు అంతరిస్తున్నాయి.  

తంగేడు తగ్గె.. హైబ్రీడ్​ వచ్చె..!

తంగేడు  లేని బతుకమ్మను ఊహించలేం. కానీ రాష్ట్రంలో గ్రానైట్ క్వారీల కోసం గుట్టలను నాశనం చేస్తుండడం, బీడుభూములను రియల్టర్లు ప్లాట్లుగా మారుస్తుండడంతో  తంగేడు చెట్లు కనిపిస్తలేవు. గతేడాది శాతవాహన యూనివర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు, స్టూడెంట్లు ఇటీవల నిర్వహించిన రీసెర్చ్​లోనూ ఈ విషయం వెల్లడైంది. ఇందుకు తగినట్లే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో తంగేడు పూలు తగ్గిపోయాయి. ఒకప్పుడు 30 రూపాయలు పెడ్తే బతుకమ్మకు సరిపడా వచ్చే పువ్వు, ఇప్పుడు రూ.300 పెట్టినా ఒక్క చుట్టుకు రావట్లేదు. గ్రామాల్లో కూడా తంగేడు దొరకడం లేదు. దీంతో చాలామంది రోడ్ల పక్కన పెరిగే హైబ్రీడ్ తంగేడు చెట్ల పూలను తెచ్చి మార్కెట్​లో అమ్ముతున్నారు. 

మక్క చేన్లు తగ్గె.. గునుగు కానరాదాయె

తెలంగాణలో పదిపదిహేను ఏండ్ల కిందివరకు మక్క, జొన్న, కంది, పల్లి, పెసర, నువ్వు లాంటి పంటలు ఎక్కువగా సాగుచేసేవాళ్లు. వర్షాకాలం చేన్లలో, చెల్కల్లోగునుగు విరివిగా పెరిగేది. పెత్రామాస నాటికి చెల్కలన్నీ గునుగుపూలతో నిండిపోయేవి. ఏ ఊరి పొలిమేరకు పోయినా బతుకమ్మకు సరిపడా పువ్వు దొరికేది. కానీ కొన్నేండ్లుగా రైతులు జొన్న, మక్క సహా పప్పులు, నూనెగింజల సాగు తగ్గించి పత్తి, వరి వేస్తున్నారు. ఈ ఏడాది 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయగా.. అందులో పత్తి 70లక్షల ఎకరాల్లో, వరి సుమారు 50 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. మొత్తంగా 1.20 కోట్ల ఎకరాల్లో ఈ రెండు పంటలే సాగవుతున్నాయి. ఈ ఎఫెక్ట్​ గునుగుపూలపై పడింది. గ్రామాల్లో కూడా ప్రస్తుతం గునుగు దొరకని పరిస్థితి ఉంది. ఇక కూరగాయలు, ముఖ్యంగా మిర్చి తోటల మధ్యలో విరివిగా పెరిగే సీతమ్మజడ పూలు (పట్టుకుచ్చుపూలు) కూడా ఎక్కడో తప్ప కనిపించడం లేదు. వరి, పత్తి చేన్లలో, కూరగాయల తోటల్లో విచ్చలవిడిగా పురుగుమందులు , కూలీల కొరతతో కలుపు నివారణ మందులు పిచికారీ చేస్తుండడంతో గునుగు, పట్టుకుచ్చుతో పాటు ఇతర గడ్డి జాతిపూలు అంతరిస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఏ మార్కెట్​లో చూసినా మస్త్​ రేట్లు  

గతంలో పట్టణాల్లో బతుకమ్మ పండుగకు ముందు ట్రాక్టర్ల కొద్దీ గునుగు, తంగేడు పూలు తెచ్చి అమ్మకానికి పెట్టేవాళ్లు, ఈసారి మోపుల్లో కూడా తేలేదు. దీంతో ఏ పువ్వు ముట్టుకున్నా మస్తు రేట్లు పలుకుతున్నాయి. ఏడాది కింద రూ.100కు మోపు వచ్చిన గునుగు మోపును కరీంనగర్​, వరంగల్​, మెదక్​ లాంటి మార్కెట్లలో ఆదివారం రూ.500 దాకా అమ్మారు. హైదరాబాద్​లో మరింత ఎక్కువ రేటుకు అమ్మారు. పిడికెడు కూడా లేని గునుగు పూల కట్టను రూ.50 నుంచి 100కు అమ్మారు. బతుకమ్మకు ఒక్క వరుసకు కావాల్సిన తంగేడు కరీంనగర్​లో రూ. 300 పలికింది. రెండు వరుసలకు కావాల్సినంత పట్టుకుచ్చు పువ్వు (సీతమ్మజడ పువ్వు)  రూ.400 పలికింది. కలుపు నివారణ మందుల కారణంగానే పట్టుకుచ్చు చెట్లు మాడిపోయాయని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని సంపత్​ అనే రైతు వాపోయాడు. ప్రస్తుతం గునుగు, తంగేడు, పట్టుకుచ్చు పూలకు కొరత ఏర్పడడంతో మార్కెట్లలో ఎటుచూసినా తోటల్లో సాగుచేసిన బంతిపూలే కనిపిస్తున్నాయి. నిజానికి బంతిపూలను ఒకప్పుడు బతుకమ్మను పేర్చిన తర్వాత పైన దండగా వేయడానికి,  మధ్యలో అక్కడక్కడ ఉంచడానికే వాడేవారు. ఇప్పుడు ఏ పువ్వులూ లేకపోవడంతో పెద్దసంఖ్యలో బంతిపూలు కొనుగోలు చేసి, వాటి వెనుకాల పుల్లలు గుచ్చి బతుకమ్మనుపేరుస్తున్నారు. వ్యాపారులు బంతిపూల రేట్లను కూడా పెంచేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏ మార్కెట్​లో చూసినా కిలో బంతిపూలు రూ.300 దాకా పలుకుతున్నాయి. పెరిగిన పూల రేట్ల వల్ల.. ఓ మోస్తరు బతుకమ్మను  పేర్చేందుకు రూ. 2 వేలకుపైగా ఖర్చు అవుతోందని సామాన్యులు అంటున్నారు.