
దక్కను పీఠభూమి సంతకంగా ఉండి తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ప్రసిద్ధిపొందిన తంగేడు చెట్లు ఈ మధ్యకాలంలో అరుదుగా కనబడుతున్నాయి. తెలంగాణ భౌగోళిక స్వరూపానికి తంగేడు చెట్టు ఒక చిహ్నం.తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలం నుంచి శతాబ్దాలుగా పూల పండుగగా ప్రసిద్ధి పొంది బతుకమ్మ రూపంలో అమ్మవారిని అర్చించే సంప్రదాయం కొనసాగుతోంది. బతుకమ్మ సంబరాలలో ప్రధానమైన పుష్పం తంగేడు. బంగారు పసుపురంగు గల పుష్పాలను కలిగి ఉండటం వల్ల గ్రామీణ ప్రజలు వీటిని బంగారంతో కూడా పోలుస్తారు.
ఔషధ గుణాలు కూడా ..
అనేక ఔషధ గుణాలు కలిగిన తంగేడును గ్రామీణ ప్రాంతాలలో అనేక రకాల రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనలు తంగేడు బెరడుకు ఎయిడ్స్ వ్యాధి లక్షణాలను నయం చేసే గుణాలు ఉన్నట్టు తేలింది.
సాంస్కృతిక చారిత్రక నేపథ్యం
ఔషధపరంగానే కాకుండా సాంస్కృతికపరంగా తంగేడు తెలంగాణ ప్రాంతానికి విడదీయలేనిది. కొమరవెల్లి మల్లన్న, ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలలో వేసే పట్నాలలో తంగేడు ఆకుల పొడిని ముగ్గుగా వాడుతారు. ఈ పొడిని భక్తులు బండారుగా పవిత్రంగా
భావిస్తారు. ఎక్కడపడితే అక్కడ పెరిగే తంగేడు ఈ మధ్యకాలంలో అనేక కారణాల వల్ల కనుమరుగైపోతోంది. బీడు భూములు తగ్గిపోవడం, గనుల తవ్వకం, చిట్టడవులు తగ్గిపోవడం వంటి అనేక కారణాల వల్ల తంగేడు మనకు కనబడడం లేదు.
తంగేడుకు ప్రత్యామ్నాయంగా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో పసుపు రంగు పుష్పాలు గల వేరే రకం మొక్కలను నాటుతున్నారు వాటి నుంచి పుష్పాలని బతుకమ్మ సంబురాలలో వాడుతున్నారు. దీనివల్ల రానున్న భవిష్యత్తు తరాలకు తంగేడు చెట్టుని పుస్తకాలలో, వీడియోలలో మాత్రమే చూపించగలుగుతాం. వీలైన చోటల్లా తంగేడు మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఖాళీ ప్రదేశాలలో విరివిగా నాటాలి.
- డా. నరసింహమూర్తి,
వృక్షశాస్త్ర అధ్యాపకుడు