పట్టణాల్లో నల్లా కనెక్షన్ కు రూ.6000
ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి రూ.10,500
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9లక్షల ఇండ్లు
ఇప్పటివరకు 1.2లక్షల ఇండ్లకు కనెక్షన్లు
6.7 లక్షల ఇండ్లకు పూర్తి కాని నల్లా కనెక్షన్
మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల కనెక్షన్లు
పట్టణ ప్రాంతాల్లోని 10 లక్షల ఇండ్లకు కొత్త కనెక్షన్లు
హైదరాబాద్ : పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన వారికి వంద రూపాయలకు కనెక్షన్ ఇవ్వనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం నల్లా కనెక్షన్ కు 6 వేల రూపాయలు డిపాజిట్ వసూలు చేస్తున్నారు. ఇక ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి 10 వేల 500 తీసుకుంటున్నారు. డిపాజిట్ రేట్ లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ముందుకు రావడం లేదని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7 లక్షల 90 వేల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం లక్షా 20 వేల ఇండ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చినట్లు సీఎం దృష్టికి వచ్చింది. ఇంకా 6 లక్షల 70 వేల ఇండ్లకు నల్లా కనెక్షన్ లు పూర్తి కాలేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3 లక్షల 30 వేల మందికి నల్లా కనెక్షన్ అందాల్సి ఉంది. వీటితో కలిపి పట్టణ ప్రాంతాల్లోని 10 లక్షల ఇండ్లకు కొత్త కనెక్షన్లు అవసరముంది.
డిపాజిట్ ఎక్కువగా ఉండడంతో మిగతా ఇంటి యజమానులు ముందుకు రావడం లేదన్న కారణంతో నల్లా కనెక్షన్ డిపాజిట్ లను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు సీఎం. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే డిపాజిట్ ను నామమాత్రం చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.
