ట్రంప్ ముందుకు ఇరాన్ ఖమేనీని ఖతం చేసే ప్లాన్.. అమెరికా వార్ స్ట్రాటజీ లీక్..

ట్రంప్ ముందుకు ఇరాన్ ఖమేనీని ఖతం చేసే ప్లాన్.. అమెరికా వార్ స్ట్రాటజీ లీక్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోతే.. ఆ దేశంపై అత్యంత భయంకరమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అమెరికా రక్షణ శాఖ ట్రంప్ ముందు ఉంచిన మిలిటరీ చర్యల ఆప్షన్లలో ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీలను చంపేసే ప్లాన్ కూడా ఉందని విదేశీ మీడియా సంస్థ ఆక్సియోస్ సంచలన నివేదించింది.

ప్రతి పరిస్థితికీ ఒక ప్లాన్..
ఇరాన్‌తో తలెత్తే ప్రతి పరిణామానికీ అమెరికా దగ్గర ఒక వ్యూహం సిద్ధంగా ఉందని ట్రంప్ సలహాదారుల ద్వారా వెల్లడైంది. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే.. ఇరాన్ మత పెద్దలను, సుప్రీం లీడర్‌ను, ఆయన వారసుడిగా భావిస్తున్న కుమారుడిని అంతం చేసేలా టార్గెటెడ్ కిల్లింగ్ ఆప్షన్‌ను అధికారులు ట్రంప్ ముందు ఉంచారంట. అయితే దీనిపై ట్రంప్ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. "రేపు ఉదయం లేవగానే ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు లేదా అసలు దాడులు చేయకపోవచ్చు.. ఆయన మనసులో ఏముందో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు" అని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.

15 రోజులే గడువు.. టెన్షన్‌లో ఇరాన్
ఈ వారంలోనే ట్రంప్ ఇరాన్‌కు ఒక స్టెర్న్ వార్నింగ్ ఇచ్చారు. అణు ఒప్పందంపై 10 నుంచి 15 రోజుల్లోగా ఒక సానుకూల నిర్ణయానికి రావాలని, లేకపోతే చాలా చెడ్డ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డెడ్ లైన్ విధించారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. ఒకవేళ అమెరికా గనుక దాడికి దిగితే.. ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

బోర్డ్ ఆఫ్ పీస్.. యుద్ధానికి సిద్ధమా?
వాషింగ్టన్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ మొదటి సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చలు బాగానే జరుగుతున్నాయని, కానీ అవి ఫలితాన్నివ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ తన వ్యూహాలను చాలా రహస్యంగా ఉంచుతున్నారు. గతంలో ఇరాన్ జనరల్ సులేమానీని హతమార్చినట్లుగానే.. ఇప్పుడు కూడా ఏదైనా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అగ్రరాజ్యం వేసే తదుపరి అడుగు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.