పాక్ కుట్రలు ఎన్నటికీ విజయవంతం కావు

పాక్ కుట్రలు ఎన్నటికీ విజయవంతం కావు

జమ్మూ: కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ, కాశ్మీర్​లలో అభివృద్ధిని అడ్డుకోవడమే పాకిస్తాన్​ లక్ష్యమని, అందులో భాగంగానే ఐఎస్ఐ దాడులు చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్​ చుగ్​ విమర్శించారు. అయితే, పాక్ కుట్రలు ఎన్నటికీ విజయవంతం కాబోవని తేల్చిచెప్పారు. ఇక్కడ శాంతిని నెలకొల్పాలని, అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తపిస్తున్నారని చెప్పారు. ఈ విషయం స్థానికులు అర్థం చేసుకున్నారని, ఆయన చూపే మార్గంలో నడిచేందుకు సిద్ధమయ్యారని అన్నారు. రాజౌరీ సెక్టార్ లో జవాన్లపై గురువారం జరిగిన టెర్రర్​దాడిని తరుణ్ చుగ్​ తీవ్రంగా ఖండించారు. అమర జవాన్ల త్యాగం వృథాగా పోనీయమని, ఈ దాడికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. టెర్రర్ దాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా నివాళులు అర్పిస్తోందని చెప్పారు. వాళ్ల కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని అన్నారు. ప్రధాని మోడీ సారథ్యంలో జమ్మూ  కాశ్మీర్ లు అభివృద్ధి మార్గంలో పయనించడం పాకిస్తానీ శక్తులకు కంటగింపుగా మారిందని తరుణ్​ చుగ్​ ఆరోపించారు. ఈ ప్రాంతాల్లో అశాంతి నెలకొల్పి, తద్వారా అభివృద్ధికి ఆటంకం కలిగించాలని ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. అయితే, ఈ కుట్రలు సక్సెస్ కావని తరుణ్ చుగ్​ ధీమా వ్యక్తం చేశారు.