
- జరిగిన విషయం వ్యాపారికి చెప్పిన గుమస్తా
- పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో డబ్బులు రిటర్న్
- ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలకు రంగం సిద్ధం?
- ఖమ్మం టౌన్ లో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
ఖమ్మం, వెలుగు: మిర్చి వ్యాపారికి చెందిన గుమస్తాను బెదిరించి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు రూ.6 లక్షలు లాక్కొన్న ఘటన ఖమ్మం సిటీలో చర్చనీయాంశమైంది. వారం కింద జరిగిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ నుంచి ఖమ్మం వచ్చి స్థిరపడిన వ్యాపారి స్థానిక వ్యవసాయ మార్కెట్ లో మిర్చి కొనుగోలు చేస్తుంటాడు. అతని గుమస్తా గత శనివారం బ్యాగ్ లో రూ.10 లక్షలు తీసుకొని బైక్ పై వెళ్తున్నాడు. సిటీలోని త్రీ టౌన్పరిధి సుందరయ్య నగర్పార్క్సమీపంలో రాత్రి 7:30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు టాస్క్ ఫోర్స్పోలీసులమంటూ ఆపారు. డబ్బులున్న బ్యాగ్ తో పాటు గుమస్తాను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి వ్యాపారం చేస్తున్నావని కేసు పెడతామంటూ అతడిని బెదిరించారు. రూ.6 లక్షలు తీసుకుని, రూ.4 లక్షలు తిరిగిచ్చి వదిలిపెట్టారు.
రెండు రోజుల కింద రాజస్థాన్ నుంచి వచ్చిన మిర్చి వ్యాపారికి గుమస్తా జరిగిన విషయం చెప్పడంతో చాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. ఎంక్వైరీ చేసి ఇద్దరు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లను గుర్తించారు. రూ.6 లక్షలు రికవరీ చేసి బాధిత మిర్చి వ్యాపారికి అందించారు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని త్రీ టౌన్పోలీసులు చెబుతుండగా.. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.