వరంగల్ జిల్లాలో సీడ్​ దందాపై టాస్క్ ఫోర్స్ ఫోకస్

వరంగల్ జిల్లాలో సీడ్​ దందాపై టాస్క్ ఫోర్స్ ఫోకస్
  • నకిలీ విత్తనాల నియంత్రణ కోసం ముమ్మరంగా తనిఖీలు
  • కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు
  • రైతులను మోసం చేస్తే పీడీ యాక్టే అంటున్న పోలీసులు
  • క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అవగాహన కార్యక్రమాలు

హనుమకొండ, వెలుగు: పంటల సీజన్ వచ్చిందంటే చాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీడ్స్, ఫర్టిలైజర్ వ్యాపారులు దందాకు తెరలేపుతున్నారు. నకిలీ విత్తనాలు అంటగట్టి అన్నదాతలను అవస్థలు పెడుతున్నారు.  డిమాండ్ ఉన్న విత్తన రకాలను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి,రైతులను దోపిడీ చేస్తున్నారు.    జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్​లతో  పాటు కమిషనరేట్ కు చెందిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. సీడ్స్, ఫర్టిలైజర్ షాపుల్లో సోదాలు చేసి, నకిలీ విత్తనాలు, అధిక ధరలకు అమ్మేందుకు బ్లాక్ చేసిన సీడ్స్ ను సీజ్ చేస్తున్నారు.

నకిలీ విత్తనాలపై నజర్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి సీజన్ లో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 900 మంది వరకు సీడ్స్, ఫర్టిలైజర్స్ డీలర్స్ ఉండగా, అందులో కొంతమంది నకిలీ దందాలకు తెరలేపుతున్నారు. లూజ్​  విత్తనాలతో పాటు లాభాల కోసం నకిలీ సీడ్స్ కూడా రైతులకు అంటగడుతున్నారు. దీంతో పత్తి, మిర్చి పంటలు వేసిన రైతులు మొలక రాక  నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతేడాది కూడా రూ.కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. అధికారులు తనిఖీలు చేపట్టి యాక్షన్ తీసుకుంటున్నా ఈ దందాకు అడ్డుకట్టపడటం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నకిలీలపై సీరియస్ ఫోకస్ పెట్టింది. 

ఈ మేరకు జిల్లా అధికారులు అగ్రికల్చర్, పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లతో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత వ్యవసాయశాఖ, పోలీసులు, విత్తన వ్యాపారులతో కోఆర్డినేషన్ మీటింగులు కూడా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ విత్తనాలు అమ్మొద్దని, రైతులను మోసం చేస్తే  పీడీ యాక్టులు  కూడా నమోదు చేస్తామని సీడ్స్, ఫర్టిలైజర్స్ డీలర్లను కూడా హెచ్చరించారు.   విత్తనాల ఎంపిక, వాడకం గురించి మండలస్థాయి అధికారులతో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 

కృత్రిమ కొరత లేకుండా చర్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సగటున ఏడు లక్షల ఎకరాల్లో పత్తి, రెండు లక్షల ఎకరాల్లో మిరప సాగవుతుంటుంది. కాగా పత్తిలో  సుమారు 15 లక్షల వరకు విత్తన ప్యాకెట్లు అవసరం కాగా అందులో ఒకట్రెండు రకాలకే రైతులు   మొగ్గుచూపుతున్నారు. రైతుల్లో డిమాండ్ నేపథ్యంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. విత్తనాలను బ్లాక్ చేసి, రేట్ పెంచి అమ్ముతున్నారు. 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ను వాస్తవానికి రూ.864 కు అమ్మాల్సి ఉండగా, రూ.1600 నుంచి రూ.2500 వరకు  అమ్మేస్తున్నారు. ఇదే విషయం ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో రెండు రోజులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని పలు సీడ్స్, ఫర్టిలైజర్ షాపులు, ఓనర్ల ఇండ్లలో తనిఖీలు చేపట్టారు.

 ఈ మేరకు బొల్లికుంట రామకృష్ణాపురంలోని మహాలక్ష్మీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఉషోదయ, మేరీ మాతా, ఓల్డ్ గ్రేన్ మార్కెట్ సమీపంలోని రఘురామ సీడ్స్, ఫర్టిలైజర్స్ షాపు, నడికూడ మండలంలోని మా వెంకటేశ్వర్లపల్లి రైతు డిపోల్లో సోదాలు చేసి కృత్రిమ కొరత సృష్టించి, ఎక్కువ రేట్లకు అమ్ముకునేందుకు  బ్లాక్ చేసిన దాదాపు రూ.6.85 లక్షల విలువైన వివిధ కంపెనీల సీడ్స్ సీజ్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు కృత్రిమ కొరతకు   చెక్ పెడుతున్నారు.  

నకిలీ విత్తనాలు అమ్మితే సీరియస్ యాక్షన్

నాణ్యత లేని, నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. డీలర్లు కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్మినా చర్యలు తప్పవు. బీజీ 2 రకాలన్నీ దాదాపు సమాన దిగుబడినే ఇస్తాయి కాబట్టి రైతులు ఒకట్రెండు రకాల కోసం డిమాండ్ క్రియేట్ చేయకుండా, అనువైన హైబ్రిడ్ రకాలు ఎంపిక చేసుకోవాలి. రైతులు విత్తన ప్యాకెట్, బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. 

ఉషా దయాళ్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, వరంగల్